
తక్కువ రక్తపోటు: దానిమ్మలో ఉండే పొటాషియం రక్త నాళాలను సడలించి రక్తపోటును తగ్గిస్తుంది. ఇది హైబీపీ ఉన్నవారికి వరం, కానీ ఇప్పటికే లో-బీపీ ఉన్నవారికి శాపం. రోజుకు 300 ml దానిమ్మ రసం తాగడం వల్ల రక్తపోటు గణనీయంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. లో బీపీ ఉన్నవారు దీనిని తీసుకుంటే మైకము, కళ్లు తిరగడం, అస్పష్టమైన దృష్టి, స్పృహ తప్పి పడిపోయే ప్రమాదం ఉంది.

దీర్ఘకాలిక మందులు: మీరు రెగ్యులర్‌గా మందులు వాడుతున్నారా? అయితే జాగ్రత్త.. దానిమ్మలోని సమ్మేళనాలు కాలేయం మందులను ప్రాసెస్ చేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా స్టాటిన్స్, ACE ఇన్హిబిటర్లు యాంటీకోగ్యులెంట్స్ వంటి మందులు వాడుతున్నప్పుడు దానిమ్మ తింటే, మందుల ప్రభావం శరీరంలో ఎక్కువ కాలం ఉండిపోయి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

సర్జరీ: ఏదైనా ఆపరేషన్ లేదా శస్త్రచికిత్సకు సిద్ధమవుతున్న వారు కనీసం రెండు వారాల ముందే దానిమ్మను మానేయాలి. ఇది రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. అనస్థీషియా మందులతో విరుద్ధంగా పని చేయవచ్చు. దీనివల్ల శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉంటుంది.

జీర్ణ సమస్యలు: దానిమ్మలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఇది జీర్ణక్రియకు మంచిదే కానీ సున్నితమైన కడుపు ఉన్నవారికి ఇబ్బంది కలిగిస్తుంది. దానిమ్మలోని టానిన్లు పేగు పొరను చికాకు పెట్టి.. కడుపు ఉబ్బరం, తిమ్మిరి లేదా విరేచనాలకు దారితీయవచ్చు. ముఖ్యంగా ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.

అలెర్జీ :కొంతమందికి దానిమ్మ తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, ముఖం లేదా గొంతు వాపు రావచ్చు. పీచు లేదా యాపిల్ వంటి పండ్లకు అలెర్జీ ఉన్నవారికి దానిమ్మతో క్రాస్ రియాక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

దానిమ్మ పండు అద్భుతమైన పోషకాల గని అనడంలో సందేహం లేదు. కానీ ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే దీనిని ఆహారంలో చేర్చుకోవాలి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనిస్తూ, పరిమితంగా తీసుకుంటేనే పసిడి లాంటి ఆరోగ్యం మీ సొంతం.