- Telugu News Photo Gallery Political photos Gujarat Assembly election 2022 know interesting facts Telugu Political News
Gujarat Elections 2022: త్వరలోనే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు.. ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్ష..
Gujarat Elections 2022: త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు మాసంలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
Updated on: Aug 25, 2022 | 4:06 PM

త్వరలో జరగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ రాష్ట్రంలోని మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు డిసెంబరు మాసంలో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలోనే విడుదల చేయనుంది. అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు కనీసం 92 సీట్లు కావాల్సి ఉంది.

ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పదవీకాలం 2023 ఫిబ్రవరి 18 వరకు ఉంది. గత అసెంబ్లీ ఎన్నికలను 2017 డిసెంబరులో నిర్వహించారు. నాటి ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 77 స్థానాల్లో గెలిచారు.

బీజేపీ విజయంతో విజయ్ రుపానీ ఆ రాష్ట్ర సీఎం అయ్యారు. 2021 సెప్టెంబర్ 11న విజయ్ రుపానీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా.. భూపేంద్ర పటేల్ ఆయన స్థానంలో సీఎం పగ్గాలు చేపట్టారు.

2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 49.1 శాతం ఓట్లు పోల్ కాగా.. కాంగ్రెస్ పార్టీకి 41.4 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ప్రస్తుత అసెంబ్లీలో బీజేపీ బలం 111గా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ సభ్యులు 64 మంది ఉన్నారు.

అధికార బీజేపీ.. అక్కడ మళ్లీ విజయఢంకా మోగించాలని పట్టుదలగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొననుంది. ఎంఐఎం, ఎన్సీపీ, భారతీయ ట్రైబల్ పార్టీ, తృణముల్ కాంగ్రెస్ పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్నాయి..

ఢిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసారి గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఆగస్టు 2న ఆ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయనున్న 10 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. భారతీయ ట్రైబల్ పార్టీతో పొత్తు పెట్టుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ఏప్రిల్ 2 నుంచే శ్రీకారంచుట్టింది.

ప్రతి నెలా రెండు మూడు సార్లు గుజరాత్‌లో పర్యటిస్తున్న అర్వింద్ కేజ్రీవాల్.. గుజరాత్‌లో నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చారు.

1995 నుంచి ఇప్పటి వరకు గుజరాత్ అసెంబ్లీకి ఆరు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నింటిలోనూ బీజేపీయే విజయం సాధించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 99 స్థానాల్లో విజయం సాధించి అధికార పగ్గాలు సొంతం చేసుకుంది. కాంగ్రెస్ 78, బీటీపీ 2, ఎన్సీపీ 1, స్వంతంత్రులు 1 స్థానాల్లో విజయం సాధించారు. ఇప్పడు వరుసగా ఏడోసారి అక్కడ విజయఢంకా మోగించాలని కమలనాధులు పట్టుదలగా ఉన్నారు.

Gujarat Elections 2022




