
దాదాపుగా అందరూ ఇడ్లీలను బియ్యం రవ్వ లేదా బియ్యంతో తయారు చేస్తారు. అయితే, బియ్యంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల అవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు చాలా మంది రాగులు, జొన్నలు వంటివి ఉపయోగిస్తున్నారు. వీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి కావాల్సిన అధిక పీచు పదార్థం లభిస్తుంది. ఇలాంటి ధాన్యాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తూ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. జొన్న ఇడ్లీలు తినటం వల్ల కలిగే లాభాలు, తయారీ విధానం ఎలాగో ఇక్కడ చూద్దాం..

జొన్నల్లో ఐరన్, కాల్షియం, పొటాషియం, పాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిలోని ఫైబర్ వల్ల కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపిస్తుంది. దీనివల్ల అతిగా తినడం తగ్గుతుంది, ఫలితంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిది. జొన్నలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. ఇవి రక్తంలోని షుగర్ లెవల్స్ అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంచుతాయి. వీటిని తీసుకోవడం వల్ల ఫిట్‌గా కూడా మారతారు.

జొన్నలు తింటే శారీరక లాభాలతో పాటు మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. జొన్నల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు , మినరల్స్ రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జొన్నల్లో విటమిన్స్ థయామిన్, నియాసిన్, ఫోలేట్స్, రిబోఫ్లేవిన్స్‌లు ఉంటాయి. ఇవి మొత్తం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. గోధుమలు లేదా ఇతర ధాన్యాలు పడని వారు నిరభ్యంతరంగా ఈ జొన్న ఇడ్లీలను తీసుకోవచ్చు. తయారీ కూడా చాలా సులువు.

తయారీ విధానం: ముందుగా జొన్న రవ్వను, మినప్పప్పును విడివిడిగా 5 నుండి 6 గంటల పాటు నానబెట్టాలి. నానిన పప్పును మెత్తగా రుబ్బి, అందులో జొన్న రవ్వను కలిపి ఇడ్లీ పిండిలా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా పులియబెట్టడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల పిండిలో మంచి బాక్టీరియా వృద్ధి చెంది జీర్ణశక్తిని పెంచుతుంది. ఇక ఆ మరుసటి రోజు ఉదయం సాధారణ ఇడ్లీల మాదిరిగానే ఆవిరి మీద ఉడికిస్తే వేడివేడి జొన్న ఇడ్లీలు రెడీ.

చాలామంది జొన్న ఇడ్లీలు గట్టిగా ఉంటాయని భావిస్తారు. కానీ సరైన పద్ధతిలో పులియబెడితే ఇవి చాలా మెత్తగా వస్తాయి. వీటిని అల్లం పచ్చడి, పల్లీల చట్నీ లేదా సాంబార్‌తో తీసుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన మార్పు కోరుకునే వారు వారంలో కనీసం మూడు సార్లు ఇలాంటి చిరుధాన్యాల అల్పాహారాన్ని తీసుకోవడం ఉత్తమం.