
ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు భారతరత్న ఇవ్వడానికి మహారాష్ట్ర కేబినెట్ ఈరోజు తీర్మానం చేసింది. మంత్రి మండలి తొలుత రతన్ టాటాకు నివాళులర్పించింది. ఆ తర్వాత ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి పంపనుంది.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేకు రాహుల్ కనాల్ లేఖ రాశారు. భారతరత్నకు రతన్ టాటా పేరును మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించాలని ఇందులో కోరారు. ఇదే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని అందులో పేర్కొన్నారు.

దేశం గర్వించే రతన్ టాటాకు ‘భారత రత్న’ పురస్కారం ఇస్తే బాగుంటుందని గతంలోనూ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున డిమాండ్లూ వచ్చాయి. అయితే, రతన్ టాటా మాత్రం అలాంటివాటిని సున్నితంగా తిరస్కరించేవారు. దీంతో ‘భారతరత్న’ ఇవ్వాలని సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని మూడేళ్ల క్రితం ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు ద్వారా విజ్ఞప్తి చేశారు కూడా. నాటి ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం మళ్లీ వైరల్‌గా మారాయి.

రతన్ టాటాకు నివాళులర్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్రంలో సంతాప దినం ప్రకటించింది. సంతాప సూచకంగా అక్టోబరు 10న మహారాష్ట్రలోని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండాను అర్ధ స్తంభానికి ఎగురవేస్తామని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.

రతన్ టాటా భౌతికకాయాన్ని ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్‌లో ఉంచారు. కడసారి నివాళులు అర్పించడానికి భారీగా జనం తరలివస్తున్నారు. ఇప్పటికే కేంద్ర హోంమంత్రి ముంబైకి బయల్దేరారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా రతన్‌టాటా పార్ధివ దేహానికి నివాళులు అర్పించేందుకు ముంబైకి బయల్దేరారు. సాయంత్రం 4 గంటలకు వర్లీ స్మశాన వాటికలో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనున్నారు.