Lumpfish: ఊసరవెల్లి లాగా రంగులు మార్చే చేప.. దీనికున్న ప్రత్యేకత ఏమిటి? ఇది ఎక్కడ ఉంటుందో తెలుసా..?
Lumpfish: ఊసరవెల్లి రంగు మార్చే జీవిగా మనందరికి తెలిసిందే. చాలా సందర్భాలలో ఈ పదాన్ని వాడుతుంటాము. ఎక్కువగా శత్రువులతో ఎవైనా గొడవలు జరిగినప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటాము..
Updated on: Jul 28, 2022 | 12:50 PM

Lumpfish: ఊసరవెల్లి రంగు మార్చే జీవిగా మనందరికి తెలిసిందే. చాలా సందర్భాలలో ఈ పదాన్ని వాడుతుంటాము. ఎక్కువగా శత్రువులతో ఎవైనా గొడవలు జరిగినప్పుడు ఈ పదాన్ని ఎక్కువగా వాడుతుంటాము. ఇలా ఉసరవెల్లి లాగా దాని రంగును మార్చే ఒక చేప కూడా ఉంది. ఈ చేప పేరు లంప్ ఫిష్. ఈ చేప ఉత్తర అట్లాంటిక్, ఆర్కిటిక్ మహాసముద్రాలలో చాలా లోతులో కనిపిస్తుంది. అనేక రంగులలో కనిపించే ఈ చేప రంగు వయస్సును బట్టి మారుతుంది.

రంగు మారుతూ మెరుస్తున్న ఈ చేపకు సంబంధించి ఇటీవల జర్నల్ ఆఫ్ ఫిష్ బయాలజీలో పరిశోధనా నివేదిక ప్రచురితమైంది. చాలా చేపల చర్మం మృదువైనదిగా ఉంటుంది. అయితే ఈ చేప ఎగుడుదిగుడుగా ఉంటుంది. దీని అసలు రంగు తెలిసిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. లంప్ ఫిష్ నిజమైన రంగు ఫ్లోరోసెంట్ ఆకుపచ్చ అని పేర్కొన్నారు.

లంప్ ఫిష్ మెరుపుకు కారణం UV కాంతి కిరణాలు. పరిశోధన ప్రకారం లంప్ ఫిష్ ఒకదానికొకటి గుర్తించడానికి మాట్లాడటానికి, ఎరను ఆకర్షించడానికి వాటి బయోఫ్లోరోసెంట్ గ్లోను ఉపయోగిస్తుంది. ఈ చేపలు సాధారణ కాంతిలో ఆకుపచ్చగా కనిపిస్తాయని, UV కాంతిలో చూసినప్పుడు వాటి శరీరంపై ప్రకాశవంతమైన నియాన్-ఆకుపచ్చ గ్లో కనిపించిందని పరిశోధనలో వెల్లడైంది.

లంప్ ఫిష్ యవ్వనంగా ఉన్నప్పుడు అవి ఇంద్రధనస్సు ఏడు రంగులలో ఏదైనా కావచ్చు. యుక్తవయస్సులో చుట్టుపక్కల వాతావరణాన్ని బట్టి వాటి రంగు మారుతుంది. ఇలా చేయడం ద్వారా ఆ చేపలు వేటాడే జంతువుల నుండి దాక్కుంటుంది. సంభోగం, సంతానోత్పత్తి కాలంలో మగ లంప్‌ఫిష్ నారింజ రంగు, ఆడ లంప్‌ఫిష్ ఆకుపచ్చగా మారుతుంది. అయితే లంప్ ఫిష్ పెద్దదైనప్పుడు లేత గోధుమరంగు నుండి లేత నీలం రంగులోకి మారుతుంది.

లంప్ ఫిష్ ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతుంది. ఒంటరితనం కోసం ఈ చేపలు ఎక్కువ సమయం సముద్రపు అడుగుభాగంలో గడుపుతాయి. ఈ చేపలు చూడటానికి వింతగా ఉంటాయి. వాటి రెక్కల కారణంగా అవి రాళ్ళు, సముద్రపు పాచికి అతుక్కుంటారు. వాటి రెక్కలు చూషణ కప్పుల వలె పనిచేస్తాయి. ఈ పరిశోధన11 జువెనైల్ లంప్ ఫిష్‌లపై జరిగింది. వాటిని వివిధ రకాల కాంతిలో చూసి చిత్రాలు తీశారు పరిశోధకులు.





























