
కామారెడ్డి పట్టణ గొంతు ఎండుతుంది.. తాగు నీటి ఎద్దడి తో పలు కాలనీలతో పాటు విలీన గ్రామాల ప్రజలు అల్లాడుతున్నారు.. ప్రతి ఏడు వేసవి కాలం వచ్చిందంటే చాలు తాగునీటి కష్టాలు మొదలు అవుతున్నాయి.. భూగర్భ జలాలు ఆడుగంటి బోర్లు ఎత్తిపోవటం, గోదావరి జలాలు అందక పోవటం తో ఇక్కడి ప్రజలు పానీ పట్టు యుద్ధం చేయాల్సి వస్తుంది.. అసలు కామారెడ్డి లో నీటి ఎద్దడికి కారణం ఏంటి.. అధికారులు ఎందుకు ప్రజల దాహార్తిని తీర్చలేక పోతున్నారు..

దిన దిన అభివృద్ధి చెందుతున్న పట్టణాల్లో కామారెడ్డి ఒకటి. పట్టణం శరవేగంగా విస్తరిస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటం లేదు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే చాలు పట్టణం లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. ఈ ఏడాది ముందుగానే నీటి సమస్య తీవ్రతరం అయింది. దాహార్తిని తీర్చేందుకు నీటి ట్యాంకర్ల పై ఆధార పడుతున్నారు.

అందుకే ఇపుడు పట్టణంలో వాటర్ ట్యాంకర్ ల జాతర కనిపిస్తుంది. కామారెడ్డి పట్టణం లోని వినాయక్ నగర్, కాకతీయ నగర్, ఎన్జీవో కాలనీ, వివేకానంద కాలనీ, శ్రీనివాస్ నగర్ కాలనీ, ఇందిరా నగర్ కాలనీల తో పాటు విలీన ఏడు గ్రామాల్లో నీటి ఎద్దడి మొదలైంది. ఇపుడు ఈ ప్రాంతాల్లో ఏ ఇంటి ముందు చూసినా నీటి బ్యారెళ్లు దర్శనం ఇస్తున్నాయి.

మున్సిపాలిటీ వారు వాటర్ ట్యాంకర్ల తో సరఫరా చేసే నీటిని పట్టుకునేందుకు వీటిని ఏర్పాటు చేసుకుంటున్నారు..పనులు మానుకుని ట్యాంకర్ల కోసం ఎదురు చూడటం ఇక్కడ సర్వదారణంగా మారింది..ట్యాంకర్ లు ఎప్పడు వస్తాయో తెలియవు,పైగా ట్యాంకర్ల వద్ద ఎగబడటం తో కాలనీ వాసుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

కొంత మంది స్వంతంగా బోర్లు వేసుకునే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోతుంది 1500 ఫీట్ల మేర బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..ఎండాకాలం వచ్చిందంటే చాలు నీటి సమస్య కామన్ గా మారిందని కానీ ఈసారి ముందస్తుగానే నీటి ఎద్దడి ఏర్పడింది అని చెప్తున్నారు. కామారెడ్డి పట్టనం లో ముప్పై వేల కు పైగా కుటుంబాలు ఉంటాయి..లక్షన్నర జనాభా ఉన్న కామారెడ్డి పట్టణానికి నిత్యం 18.23MLD నీరు అవసరం ఉండగా కేవలం 10.59 MLD నీరు మాత్రమే సరఫరా అవుతుంది. దీంతో కొన్ని కాలనీల్లో ప్రజలు దాహార్తి తో అలమటిస్తున్నారు. కామారెడ్డి ప్రజల తాగు నేటికి పెద్ద చెరువు ప్రధాన ఆధారం, కానీ చెరువు నుండి సరిపడా నీరు ఫిల్టర్ బెడ్ నుండి వాటర్ ట్యాంకులకు చేరటం లేదు.

దీంతో వారానికి రెండు రోజులు మాత్రమే నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మిగితా లోటును పూరించేందుకు కామారెడ్డి బల్దియా అధికారులు ట్యాంకర్ ల పై ఆధార పడుతున్నారు. నిత్యం పది ట్యాంకర్ ల ద్వారా 50 నుండి 70 ట్రిప్పుల నీటిని సరఫరా చేస్తున్నారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోర్ల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. మున్సిపాలిటీ లో ఏర్పాటు చేసిన సేవ కేంద్రానికి సమాచారం ఇస్తే ట్యాంకర్ల ను పంపిస్తున్నారు. కానీ అవి కూడా సరిపోక ప్రజల గొంతెండుతోంది.

కామారెడ్డి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం లో భారీ ప్రణాళికలు చేసింది..ఎస్సారెస్పీ నుండి గోదావరి జలాలను కామారెడ్డి కి తరలించి ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు తీసుకుంది 110 కిలోమీటర్ల మేర పైపు లైన్ల తో పాటు భారీ పంపు హౌస్ ఏర్పాటు చేసింది. తరుచూ పైపు లైన్ల లికేజి ఏర్పడటం,మరమ్మతు పనుల్లో జాప్యం జరగటం కారణంగా నీటి ఎద్దడి ఏర్పడుతుంది. వేసవి ప్రారంభానికి ముందే మరమ్మతు పనులు పూర్తి చేయిస్తే నీటి సమస్య ఏర్పడదని పట్టణ ప్రజలు చెప్తున్నారు. అటు కేంద్రం మంజూరు చేసిన అమృత్ పథకం పనులు పూర్తి చేయిస్తే నీటి ఎద్దడి నివారించే అవకాశం ఉంది.