
ఇటీవల కాలంలో సైబర్ మోసాలు, హ్యాకింగ్‌లు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బలమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని పదేపదే సూచిస్తూన్నా కొందరు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. '123456' ఇది అత్యధిక మంది వినియోగిస్తున్న మోస్ట్ కామన్ పాస్‌వర్డ్ అని అధ్యయనాలు తెల్పుతున్నాయి.

ఇలాంటి పాస్ట్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి సైబర్ నేరస్తులకు సెకన్ కంటే తక్కువ వ్యవధిలోనే సులువు అవుతుంది. అయినా యూజర్లలో పెద్దగా మార్పు రావడం లేదని తాజాగా ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. ఇప్పటికీ ఎక్కువ మంది ఉపయోగిస్తున్న పాస్‌వర్డ్ '123456' అని పనామా కేంద్రంగా పనిచేస్తున్న నార్డ్‌పాస్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ తెలిపింది.

దాదాపు 45 లక్షల మంది ఈ పాస్‌వర్డ్‌ను వినియోగిస్తున్నారు. దీన్ని హ్యాకర్లు కేవలం ఒక్క సెకన్‌లో కనిపెట్టగలరని వెల్లడించింది. ఆ తర్వాత రెండో స్థానంలో వినియోగిస్తున్న పాస్‌వర్డ్ 'admin', దీనిని దాదాపు 40 లక్షల మంది వినియోగిస్తున్నారు. మూడో స్థానంలో వినియోగిస్తున్న పాస్‌వర్డ్ (12345678). దీనిని 13.7 లక్షల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. ఈ మేరకు అధ్యయనంలో బయటపడింది.

ఇక భారత్‌లో ఎక్కువ మంది వినియోగిస్తున్న పాస్‌వర్డ్ '123456'. దాదాపు 3.6 లక్షల అకౌంట్లకు ఇదే పాస్‌వర్డ్ వినియోగిస్తున్నారు. అలాగే 'admin' పాస్‌వర్డ్ 1.2 లక్షల మంది వినియోగిస్తున్నట్లు నార్డ్‌పాస్ వెబ్‌సైట్ అధ్యయనంలో వెల్లడైంది. పరిశోధన బృందాలు 6.6 టెరాబైట్ల డేటాబేస్‌ను స్టీలర్ మాల్వేర్ల సాయంతో యాక్సెస్ చేసుకొని ఈ సమాచారాన్ని పొందుపర్చినట్లు తెలిపింది. కేవలం స్టాటిస్టికల్ సమాచారం మాత్రమే తమకు అందిందని, యూజర్ల వ్యక్తిగత వివరాలేవీ తమకు ఇవ్వలేదని వెల్లడించింది.

ఇతర వెబ్‌సైట్లతో పోలిస్తే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించే యూజర్లు అత్యంత బలహీన పాస్‌వర్డ్‌లను ఉపయోగిస్తున్నారని తెలిపింది. ‘123456’ను ‘అత్యంత వరస్ట్ పాస్‌వర్డ్’గా అభివర్ణించింది. అప్పర్‌కేస్, లోయర్‌కేస్ ఆంగ్ల అక్షరాలు, అంకెలు, స్పెషల్ క్యారెక్టర్లు పాస్‌వర్డ్‌లో ఉండేలా చూసుకోవాలని, ఒకే పాస్‌వర్డ్‌ను వివిధ ఖాతాలకు ఉపయోగించడం కూడా సరికాదని సూచించింది.