
గుడ్లు త్వరగా పాడైపోతాయి. కాబట్టి నిల్వ చేసిన గుడ్లు తినడం అంత మంచిది కాదు. గుడ్లు ఉడకబెట్టిన తర్వాత ఎంత సమయం పాటు నిల్వ చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం..

ఉడికించిన గుడ్లు సరిగ్గా నిల్వ చేస్తే కొన్ని రోజులు సురక్షితంగా ఉంటాయి. పొట్టు తీయని గట్టిగా ఉడికించిన గుడ్లను రిఫ్రిజిరేటర్‌లో ఉంచితే దాదాపు 7 రోజుల వరకు తినదగినవిగా ఉంటాయి.

గుడ్డు పెంకు గుడ్డును బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది. కాబట్టి అది ఎక్కువ రోజులు చెడి పోకుండా ఉంటుంది. ఉడికించిన గుడ్లు, వాటి పెంకులు తొలగించి, రిఫ్రిజిరేటర్‌లో 2 నుంచి 3 రోజుల వరకు సురక్షితంగా ఉంటాయి. వాటిని ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో మూసి ఉన్న కంటైనర్‌లో మాత్రమే నిల్వ చేయడం మంచిది.

ఉడికించిన గుడ్లు గది ఉష్ణోగ్రత వద్ద 6 నుంచి 7 గంటల కంటే ఎక్కువ సమయం సురక్షితంగా ఉండవు. అవి త్వరగా చెడిపోయే అవకాశం ఉంది. గుడ్డు బలమైన చెడు వాసన కలిగి ఉండి, రంగు మారినట్లు కనిపిస్తే దానిని తినకూడదు.

గుడ్డు చెడిపోయిందనడానికి ఉపరితలం జిగటగా ఉండటం కూడా సంకేతం. అలాంటి గుడ్లను తినకూడదు. ఉడికించిన గుడ్లను ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. తరచుగా బయటకు తీయకూడదు. గుడ్లు చాలా రోజులు నిల్వ చేసినట్లైతే వాటిని తేలికగా వాసన చూసి తినాలి.