
చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శ్వాస సమస్యలు కూడా పొంచి ఉంటాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉంటుంది.

చలికాలంలో వేడి వేడి టీ, కాఫీ తాగితే హాయిగా అనిపిస్తుంది. అయితే చల్లగా ఉన్నప్పుడు ఈ ప్రత్యేకమైన టీలను వేడి వేడిగా తాగారంటే గొంతుకు కూడా చాలా ఉపశమనం కలిగిస్తుంది. జలుబుతో బాధపడేవారు ఈ ప్రత్యేకమైన మసాలా టీని ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ టీ ఒక్కసారి తాగితే దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

గ్యాస్ మీద పాన్ ఉంచి బే ఆకులు, సోపు, ఏలకులు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ముల్లేతి, ఎండిన అల్లం, పెద్ద ఏలకులు, తులసి ఆకులు వేసి బాగా వేయించాలి. అన్ని మసాలా దినుసులను బాగా వేయించి, వాటిని మిక్సీలో వేసి పౌడర్‌గా చేసుకోవాలి.

ఒకటిన్నర కప్పుల నీటిని మరిగించి, అందులో ఒక చెంచా టీ ఆకులు వేసి మూత పెట్టాలి. తర్వాత అందులో రెండు కప్పుల పాలు పోసి మరిగించాలి. ఇప్పుడు గ్యాస్‌ను ఆపివేసి ఈ మసాలా పొడిని ఒక స్పూన్ వేసి 5-7 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. రుచి కోసం కొద్దిగా పంచదార వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వేడి టీని కప్పులో నింపుకుని సిప్ చేస్తే బలే రుచిగా ఉంటుంది.

ఈ టీని రోజుకు రెండుసార్లు తాగడం వల్ల ఆస్తమా సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ఈ టీని పాలు లేకుండా కూడా చేయవచ్చు. ఇలా రోజుకు మూడుసార్లు చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. జలుబు, దగ్గు నుంచి దూరంగా ఉండవచ్చు. కఫం రాకుండా నివారిస్తుంది.