
వంటగదిలో తరచూ ఉపయోగించే వాటిల్లో నిమ్మ ఒకటి. వంట నుంచి చర్మ సంరక్షణ, ఇంటి శుభ్రపరచడం వరకు ప్రతిదానిలోనూ నిమ్మ రసం విస్తృతంగా ఉపయోగిస్తుంటాం. అందుకే చాలా మంది ఒకటి లేదా రెండు నిమ్మకాయలను కొనడానికి బదులుగా వాటిని పెద్ద పరిమాణంలో కొని ఇంట్లో నిల్వ చేస్తుంటారు. కానీ మార్కెట్లో కొన్న నిమ్మకాయలు రెండు రోజుల్లోనే ఎండిపోతాయి. వాటి రంగు గోధుమ రంగులోకి మారుతుంది. మీరు కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నారా?అయితే ఈ కింది చిట్కాలను అనుసరించడం ద్వారా నిమ్మకాయలను చాలా కాలం ఫ్రెష్‌గా ఉంచవచ్చు..
నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచుకోవాలంటే ముందుగా మార్కెట్ నుంచి సరైన నిమ్మకాయను కొనాలి. నిమ్మకాయ చాలా గట్టిగా ఉంటే, దానిని కొనకండి. కొంచెం మెత్తగా ఉండే నిమ్మకాయను ఎంచుకోవాలి. అలాగే తాజా నిమ్మకాయ మంచి వాసన వస్తుంది. వాటిని కొనండి.
నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి వాటిని నేరుగా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవద్దు. నిమ్మకాయలను బాగా కడిగి శుభ్రం చేయాలి. ఇప్పుడు ఒక గాజు సీసాలో నీటితో నింపి, నిమ్మకాయలను అందులో ఉంచి గాజు సీసా మూత గట్టిగా పెట్టి మూసివేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయాలి. మీరు ఈ టిప్స్ పాటిస్తే నిమ్మకాయలు త్వరగా చెడిపోకుండా తాజాగా ఉంచవచ్చు. ఇదే విధంగా నిమ్మరసాన్ని కూడా రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేయవచ్చు.
మీకు రిఫ్రిజిరేటర్ లేకపోయినా పర్వాలేదు. నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచేలా నిల్వ చేయవచ్చు. ఇందుకోసం, మొదట నిమ్మకాయను కడిగి, శుభ్రం తుడిచి, ఆపై నిమ్మకాయ ఉపరితలంపై తేలికగా నూనె రాయాలి. ఆవాల నూనె లేదా నెయ్యిని ఉపయోగించవచ్చు. ఆ తరువాత, నిమ్మకాయలను ఒక్కొక్కటిగా టిష్యూ పేపర్‌లో చుట్టి చల్లని ప్రదేశంలో ఒక కంటైనర్‌లో ఉంచండి. ఈ విధంగా చేయడం వల్ల నిమ్మ పండ్లు చాలా కాలం పాటు తాజాగా, జ్యుసిగా ఉంటాయి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.