
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరి కిచెన్‌లో ప్రెషర్ కుక్కర్ ప్రధానంగా ఉంటోంది. దీనితో తక్కువ సమయంలోనే ఆహారాన్ని ఈజీగా వండొచ్చు. అయితే, ప్రెషర్ కుక్కర్‌లో వండిన ఆహారం తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందా.? పోషకాలు సరిగ్గా శరీరానికి అందవా.? అనే ప్రశ్న తరచుగా వినిపిస్తున్నాయి. మరి నిపుణులు ఏం చెబుతున్నారంటే..

గాలి చొరబడకుండా, తక్కువ నీటితో ప్రెషర్ కుక్కర్ వేడివేడి ఆహారాన్ని.. అతితక్కువ సమయంలోనే అందిస్తుంది. అయితే దీని వల్ల విటమిన్ సి, ఫోలేట్ లాంటివి శరీరానికి సరిగ్గా అందవు. అధిక ఉష్ణోగ్రతలో ఆహారాన్ని వండటం వల్ల కొన్ని రకాల పోషకాలు శరీరానికి సరిగ్గా చేరవని నిపుణులు అంటున్నారు.

ముఖ్యంగా బీన్స్, పప్పుధాన్యాల్లో ఉండే పోషకాలు అధిక ఉష్ణోగ్రతల్లో వండటం వల్ల అవి నాశనమవుతాయి. బంగాళాదుంపలు, బియ్యం లాంటి పిండి పదార్థాలను అధిక వేడిలో వండినప్పుడు.. అవి అక్రిలమైడ్ లాంటి హానికరమైన రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేయవచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది.

ఇలాంటి రసాయనాలను అధిక మొత్తంలో తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పప్పుధాన్యాలు, చిక్కుళ్లు వండినప్పుడు వాటిలో ఉండే లెక్టిన్స్ లాంటి యాంటీ న్యూట్రియంట్స్ పూర్తిగా తొలగిపోకపోతే జీర్ణ సమస్యలు రావొచ్చు. తక్కువ నాణ్యతతో ఉండే అల్యూమినియం కుక్కర్లను ఉపయోగించినప్పుడు.. దాని లోహం ఆహారంతో కలిసిపోయే ప్రమాదం కూడా ఉంది.

అందుకే ఎప్పుడూ కూడా ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్లను వాడటం ఉత్తమమని నిపుణులు అంటున్నారు. అలాగే తరచూ ప్రెషర్ కుక్కర్‌పైనే ఆధారపడకుండా.. సంప్రదాయ వంట పద్దతులను కూడా అనుసరించడం ఆరోగ్యానికి మరింత మేలు చేస్తుందని అంటున్నారు.