
ఉదయం లేవగానే చాలా మందికి టీ లేదా కాఫీ కళ్లకు ఎదురుగా ఉండాలి. చాలా మందికి బెడ్ కాఫీ తాగే అలవాటు ఉంది. ఉదయమే కాదు మధ్యాహ్నం నిద్రించి సాయంత్రం లేవగానే ఓ టీ చుక్క నోట్లో పడాల్సిందే. లేదంటే మత్తు వదలదు. వేరే పని మీద ధ్యాస వెళ్లదు.

ఇలా చాలా మందికి నిద్ర లేవగానే టీలు, కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. సాయంత్రం సంగతి పక్కన పెడితే.. ఉదయం పరగడుపున మంచి నీళ్లు కూడా తాగకుండా టీ తాగితే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీరే చేతులారా నాశనం చేసుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ తాగితే రోజంతా అసలటగా ఉంటుందట. కొంత మందికి వికారంగా, గ్యాస్టిక్ సమస్యలు కూడా వస్తాయి. ఉదయాన్నే వేడి వేడి కాఫీ పరగడుపున తాగితే కడుపులోని మంచి బ్యాక్టీరియాపై ఎఫెక్ట్ పడుతుందట. ఇది కాస్త జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది.

నిద్ర లేవగానే పరగడుపున అయినా సరే కొన్ని మంచినీళ్లు తాగాలని నిపుణులు అంటున్నారు. శరీరంలో తగినంత నీరు లేకపోతే డీ హైడ్రేషన్ బారిన పడి, మూత్ర సమస్యలు రావచ్చు. నోటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దుర్వాసన కూడా పెరుగుతుంది.

అందుకే ఉదయం నిద్ర లేవగానే బెడ్ టీ తాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోండి. నోటిని ఫ్రెష్ చేసుకుని మంచి నీళ్లు తాగిన తర్వాత టీ, కాఫీలు తాగడం మంచిది. ఉదయం గోరు వెచ్చని నీరు తాగితే శరీరానికి మరింత మంచిది.