
ఈ రోజూ ఎంతో రుచికరంగా ఉండే పర్ఫెక్ట్ పెరుగు పులుసును సులభంగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పెరుగు పులుసు తయారీకి ముందుగా పెరుగు ఎంపిక ఎంతో ముఖ్యం. మరీ పుల్లగా లేకుండా కమ్మగా ఉన్న పెరుగును తీసుకోవాలి. అర లీటరు కమ్మటి పెరుగును తీసుకుని, కవ్వంతో లేదా విస్కర్ సహాయంతో ఎక్కడా గడ్డలు లేకుండా మృదువుగా చిలుక్కోవాలి.

పెరుగు పులుసు కాస్త చిక్కగా ఉంటేనే రుచి బాగుంటుంది కాబట్టి ఇందులో నీళ్లు కలపాల్సిన అవసరం లేదు. ఇలా చిలుక్కున్న పెరుగులో రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పులతో కూడిన తాలింపు దినుసులు వేసి ఎర్రగా వేయించాలి. పోపు బాగా వేగిన తర్వాత అర స్పూన్ కచ్చాపచ్చాగా దంచిన అల్లం వేసి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా వేగకుండా లైట్‌గా మగ్గితే సరిపోతుంది.

ఆ తర్వాత అర కప్పు క్యారెట్ ముక్కలు, ఒక టమాటో ముక్కలు మరియు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపాలి. క్యారెట్ ముక్కలు వేయడం వల్ల ఈ పెరుగు పులుసుకు ఒక ప్రత్యేకమైన తీపి, కమ్మటి రుచి వస్తుంది. ముక్కలు త్వరగా మగ్గడానికి చిటికెడు ఉప్పు వేసి మూతపెట్టి రెండు మూడు నిమిషాలు ఉడికించాలి.

ముక్కలు 80 శాతం ఉడికిన తర్వాత కరివేపాకు, పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. పోపు మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత అందులో ముందుగా సిద్ధం చేసుకున్న పెరుగును పోసి బాగా కలుపుకోవాలి. వేడిమీద పెరుగు పోస్తే విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసాకే కలపాలి. ఉప్పు సరి చూసుకుంటే కమ్మటి పెరుగు పులుసు సిద్ధమవుతుంది.