- Telugu News Photo Gallery Cricket photos Team India Player Jitesh Sharma Named PBKS New Captain in IPL 2024
IPL 2024: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా టీమిండియా ఫ్యూచర్ కీపర్.. తొలి విజయం దక్కేనా?
PBKS New Captain Jitesh Sharma: ఈ ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 13 మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు లీగ్ దశలోని చివరి మ్యాచ్‌కు కీలక ఆటగాళ్లు అందుబాటులో లేరు. దీంతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేసింది. ఇక చివరి మ్యాచ్‌లో గెలిచి ఐపీఎల్ 17వ సీజన్‌ను ముగించాలని కోరుకుంటుంది.
Updated on: May 19, 2024 | 12:57 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024)లో తమ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈరోజు (మే 19) మధ్యాహ్నం హైదరాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు వికెట్ కీపర్ జితేష్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.

భుజం గాయం కారణంగా పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న శామ్ కుర్రాన్ అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఇంగ్లాండ్‌కు తిరిగి వెళ్లాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టు మరో కెప్టెన్‌ని ఎంపిక చేయాల్సి వచ్చింది.

దీని ప్రకారం, ఇప్పుడు 30 ఏళ్ల వికెట్ కీపర్-బ్యాటర్ జితేష్ శర్మ పంజాబ్ కింగ్స్ జట్టుకు కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దీంతో పాటు పంజాబ్ కింగ్స్ జట్టుకు సారథ్యం వహించే 16వ కెప్టెన్‌గా కూడా జితేష్ శర్మ నిలిచాడు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు 13 మ్యాచ్‌లు ఆడగా 5 మ్యాచ్‌లు గెలిచింది. 8 మ్యాచ్ ల్లో ఓడిన కింగ్స్ తన చివరి మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోతే 9వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోతుంది.

తద్వారా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిచి 9వ స్థానంతో ఐపీఎల్ ప్రచారాన్ని ముగించాలని పంజాబ్ కింగ్స్ జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే తొలిసారి కెప్టెన్ గా బరిలోకి దిగుతున్న జితేష్ శర్మకు విజయ వరిస్తుందో లేదో చూడాలి.




