
PSL 2026 Unprofessional Captains: పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ఆరంభానికి ముందు జరిగిన ఒక సంఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. లాహోర్‌లోని గడాఫి స్టేడియంలో నిర్వహించిన కెప్టెన్ల రౌండ్ టేబుల్ మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కరాచీ కింగ్స్ సారధ్యం వహిస్తున్న డేవిడ్ వార్నర్ తన జట్టు వ్యూహాలను సీరియస్‌గా వివరిస్తుండగా, పక్కనే కూర్చున్న ఇతర జట్ల కెప్టెన్లు షాహీన్ అఫ్రీది, మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్ ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ వార్నర్ మాటలను పట్టించుకోలేదు.

దీంతో తీవ్ర అసహనానికి గురైన వార్నర్, "క్షమించండి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇక్కడ కొంతమంది స్కూల్ పిల్లల్లా ప్రవర్తిస్తున్నారు. వీరు తమను తాము ప్రీమియం ఆటగాళ్లమని పిలుచుకుంటున్నారు కానీ వీరి ప్రవర్తన మాత్రం చిన్న పిల్లల కంటే దారుణంగా ఉంది.

మీడియా సమావేశంలో ఎలా ప్రవర్తించాలో కూడా వారికి తెలియదా?" అని ప్రశ్నిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సమావేశాన్ని నిర్వహించిన తీరుపై కూడా నెటిజన్లు జోకులు పేలుస్తున్నారు. ఇది లీగుల్లోనే అత్యంత చెత్త కెప్టెన్ల ప్రెస్ కాన్ఫరెన్స్ అంటూ పలువురు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మొత్తానికి పీఎస్ఎల్ సారథులు ఇలా తమ పరువు తామే తీసుకున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలోనూ విమర్శలు గుప్పిస్తున్నారు. డేవిడ్ వార్నర్ ఇలా సీరియస్ అవ్వడంతో పీఎస్ఎల్ ప్రాభవం క్రమంగా కోల్పోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.