
ఆచంట నియోజకవర్గంలో ఎక్కడ టీడీపీ సభలు, సమావేశాలు జరిగినా.. పార్టీ శ్రేణుల ఇళ్లలో జరిగే ఫంక్షన్‌లకు, వేడుకలకు తరుచూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతూ ఉంటారు. ఆయన్ను చూసి అందరూ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆనందిస్తూ ఉంటారు. అవునా సీఎం గారిని అంత తీరిక ఎక్కడుంది. నవ ఆంధ్రా నిర్మాణంలో బిజీగా ఉంటే అనుకునేరు.

అక్కడికి వచ్చేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాదు అచ్చు గుద్దినట్లు ఆయనలాగే ఉండే ఆండ్రు లక్ష్మణ్. ఈయన ఆచంట చినపేటకు చెందినవారు. సేమ్ టూ సేమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులాగా తలకట్టు, గడ్డం, డ్రెస్సింగ్ స్టయిల్‌ను నిత్యం మెయింటేన్ చేస్తారు లక్ష్మణ్ అలియాస్ ఆచంట చంద్రబాబు నాయుడు.

ఆచంటలోని చినపేటకు చెందిన టిడిపి అభిమాని ఆండ్రు లక్ష్మణ్ ఆకారంలో అచ్చు చంద్రబాబు నాయుడులాగానే ఉంటారు. దీంతో ఆయనలా హావభావాలు వస్త్రధారణ నడకతో చంద్రబాబును తలపిస్తారు. టిడిపి సభలు, సమావేశాలకు ఫంక్షన్‌లకు చంద్రబాబులా ఇద్దరు డూప్ గన్ మెన్‌లను వెంట పెట్టుకుని వచ్చి అందరినీ పలకరిస్తూ.. ఆయనలా హావభావాలు చేస్తూ అలరిస్తారు. అంతేకాదు అచ్చు చంద్రబాబులా స్పీచ్ ఇస్తూ ఉంటారు.

ఇటీవల నియోజకవర్గంలో జరిగిన క్రిస్టమస్ కార్యక్రమాల్లో ఆచంట సీబీఎన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈయన్ని చూసి ప్రజలే కాదు చంద్రబాబు నాయుడు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఆండ్రు లక్ష్మణ్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాలలో అభినందించారు.

ఇప్పుడు చంద్రబాబు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా లక్ష్మణ్‌ను అభినందించారు. తాను లక్ష్మణ్ అభిమానిని అంటూ ట్వీట్ చేశారు. లక్ష్మణ్ చంద్రబాబులా మాట్లాడేందుకు చాలా కష్టించారని అందులో పేర్కొన్నారు.