కొంతమంది హీరోలు స్క్రీన్ మీద ఎంత తరచుగా కనిపిస్తే, అంతగా పండగ చేసుకుంటారు అభిమానులు. ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్న వారు రావడం ఆలస్యం చేస్తే, అటు హీరోని ఏమీ అనలేక, ఇటు చేసేదేమీ లేక అలా ఉస్సూరుమంటూ ఉంటారు ఫ్యాన్స్. ఇప్పుడు యష్ ఫ్యాన్స్ లోనూ అలాంటి పరిస్థితే కనిపిస్తోంది.
రాకీ భాయ్ యష్ నుంచి ఓ చిన్న ఉప్పందితే చాలు ఫెస్టివల్ చేసుకుంటాం అంటున్నారు ఫ్యాన్స్. అలాంటివారిని ఉద్దేశించి లేటెస్ట్ గా యష్ చెప్పిన మాటలు అందరినీ కన్‌ఫ్యూజన్‌లో పడేస్తున్నాయి. నెక్స్ట్ సినిమా ఎప్పుడు గురూ అని అందరూ అడుగుతుంటే, అర్థం అయ్యీ కానట్టూ ఓ విషయాన్ని హింట్ ఇచ్చినట్టు కొన్ని మాటలు చెప్పారు రాకీ భాయ్.
నా ఫ్యాన్స్ తొందరపడుతున్నారు కదా అని సగం ఉడికించిన అన్నాన్ని వడ్డించడానికి నేను సిద్ధంగా లేను అన్నది యష్ ఇచ్చిన స్టేట్‌మెంట్. అంతటితో ఆగలేదు ఈ కన్నడ స్టార్. నేనేం విశ్రాంతి తీసుకోవడం లేదు అంటూ ఫ్యాన్స్ లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. అందరూ గర్వపడే సినిమా చేస్తానని, ఇంకొన్నాళ్లు ఓపిక పట్టమని రిక్వెస్ట్ చేశారు.
ఇప్పుడు ప్రశాంత్‌నీల్ ఎలాగూ సలార్‌ని కంప్లీట్ చేశారు. అంటే నెక్స్ట్ కేజీయఫ్3 మీద ఏమైనా ఫోకస్ చేసే ఆలోచనల్లో ఉన్నారా అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. మరోవైపు లేడీ డైరక్టర్ గీతూ మోహన్‌దాస్‌తో యష్ చేస్తారంటూ వచ్చిన వార్తలు ఏమయ్యాయనే చర్చ కూడా గట్టిగానే జరుగుతోంది.
సలార్‌లో యష్ గెస్ట్ రోల్‌లో కనిపిస్తారా? లేదా? నెక్స్ట్ ఆయన చేయబోయే పక్కా సినిమాకు డైరక్టర్ గీతూ మోహన్‌దాసా? లేకుంటే, ప్రశాంత్ నీలా?.. అంటూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. రావణాసురుడి కేరక్టర్‌తో యష్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం కూడా ఆ మధ్య ముమ్మరంగానే జరిగింది. వీటన్నిటి మీదా ఓ క్లారిటీ రావాలంటే యష్ మనసులోని మాటలను స్పష్టంగా చెప్పాల్సిందే. అప్పటిదాకా వెయిటింగ్ తప్పదు మరి.