
సాధారణంగా ఓ ఫ్లాప్ ఇస్తే.. ఆ దర్శకుడి వైపు వెళ్లడానికి ఆలోచిస్తుంటారు నిర్మాతలు. కానీ బోయపాటి మాత్రం స్కంద తర్వాత అప్పుడే గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్‌ను ఒప్పించారు. ఆయన్ని ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. కానీ బోయపాటి కథలో నటించడానికి హీరో కరువయ్యారిప్పుడు. బిజీ హీరోలను నమ్ముకుని.. తాను ఖాళీ అయిపోయారు బోయపాటి.

గీతా ఆర్ట్స్‌లో బోయపాటి శ్రీను సినిమా అనగానే.. అందరూ ముందుగా అల్లు అర్జున్ కోసమే అనుకున్నారు. కానీ బన్నీతో సినిమా అంటే బోయపాటి కనీసం మరో మూడేళ్లు వెయిట్ చేయాలి. ఎందుకంటే పుష్ప 2తో పాటు 3 కూడా ఉండేలా కనిపిస్తుందిప్పుడు. అలాగే అట్లీ కుమార్ ప్రాజెక్ట్ లాక్ అయింది. ఇవన్నీ అవ్వాలంటే కనీసం రెండు నుంచి మూడేళ్లైనా పడుతుంది.

బన్నీ కాకపోయినా.. బాలయ్య ఉన్నాడుగా.. బోయపాటి అంటే వెంటనే ఓకే చెప్తారులే అనుకున్నారు. కానీ అఖండ 2ను తన రెండో కూతురు తేజస్విని బ్యానర్‌లో చేయాలనుకుంటున్నారు బాలయ్య.

అందుకే గీతా ఆర్ట్స్‌లో ఈ ప్రాజెక్ట్ వర్కవుట్ అయ్యే అవకాశాలు తక్కువ. దానికితోడు బాబీ తర్వాత హరీష్ శంకర్ సినిమాను లైన్‌లో పెడుతున్నారు బాలయ్య. దాంతో బోయపాటికి ఎదురు చూపులే మిగిలాయి.

బన్నీ, బాలయ్య కుదరకపోవడంతో.. విజయ్ దేవరకొండ వైపు చూస్తున్నారు బోయపాటి. ఈ వారమే విజయ్‌ను కలిసి నెరేషన్ ఇవ్వనున్నారీయన. ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్‌తో పాటు గౌతమ్ తిన్ననూరి సినిమాలు చేస్తున్నారు విజయ్. ఒకవేళ బోయపాటి సినిమా వర్కవుట్ అయినా.. గౌతమ్ తర్వాతే ఉండే అవకాశాలున్నాయి. మొత్తానికి కథ రెడీగా ఉన్నా.. హీరోలు లేక ఖాళీగా ఉండిపోయారు బోయపాటి శ్రీను.