
తమిళ హీరోలు సినిమాల కంటే రాజకీయాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారా..? రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా పాలిటిక్స్‌తో పడలేనురా బాబూ అంటూ పక్కకు జరిగిన చోటే.. ఈ జనరేషన్ హీరోలు రప్ఫాడించాలని ఫిక్సైపోతున్నారా..? విజయ్ పొలిటికల్ ఎంట్రీని మరిచిపోక ముందే.. మరో హీరో కూడా ఆయన దారిలోనే వెళ్తున్నారని తెలుస్తుంది. మరి ఆయనెవరు..?

తమిళ ఇండస్ట్రీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. దానికి కారణం సినిమా వాళ్ళే ఎక్కువగా పాలిటిక్స్‌పై ఫోకస్ చేస్తుండటమే. ఇప్పటికే ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు ఉదయనిధి అధికార పార్టీలో ఉన్నారు. ఆయనతో పాటు కమల్ హాసన్ కూడా రాజకీయాల్లో ఉన్నారు. కొత్తగా విజయ్ తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ స్థాపించి పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేస్తామని తెలిపారు.

తమిళనాట విజయ్ పార్టీ గురించే జోరుగా చర్చ జరుగుతున్న సమయంలో.. విశాల్ సైతం రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అయినా విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఊహించిందే. గతంలోనే చెన్నై ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు విశాల్ నామినేషన్ వేశారు. అయితే కొన్ని కారణాల రీత్యా ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది.

2026 అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా విశాల్ పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుంది. త్వరలోనే తన పార్టీ పేరును ప్రకటించబోతున్నారని తెలుస్తుంది. నేను రాజకీయాల్లోకి రావడం ఖాయం.. సమాజసేవే నా లక్ష్యం అంటూ గతంలోనే విశాల్ తెలిపారు.

మొత్తానికి ఇటు విజయ్.. అటు విశాల్.. ఇంకోవైపు కమల్ హాసన్.. వీళ్ళందరి ఎంట్రీతో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయన్నమాట.