
ఇది సినిమా ఇండస్ట్రీ.. ఉనికి కాపాడుకోడం కోసం దర్శకులు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటారు. కావాలంటే చూడండి.. అంటే సుందరానికి, బ్రోచేవారెవరురా లాంటి క్లాస్ మూవీస్ తీసిన వివేక్ ఆత్రేయ ఒక్క ఫ్లాప్‌కే తనను తాను మార్చుకుని సరిపోదా శనివారం అంటూ మాస్ సినిమాతో వచ్చి హిట్టు కొట్టారు.

అలాగే శేఖర్ కమ్ముల కూడా తనది కాని దారిలో కుబేరాతో వస్తున్నారు. కుబేరా టీజర్స్, కంటెంట్ చూస్తుంటే అసలు ఇది శేఖర్ కమ్ముల సినిమానేనా అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే కమ్ముల సినిమా అంటే సపరేట్ మార్క్ ఉంటుంది. దాన్ని దాటి.. తనను తాను కొత్తగా చూపించుకోడానికి ట్రై చేస్తున్నారు ఈ దర్శకుడు.

చెప్తే వింతగా అనిపిస్తుంది కానీ.. కొరటాల శివ కూడా దేవరతో ఇలాంటి ప్రయత్నమే చేసారు. ఆచార్య తర్వాత మేకింగ్ పరంగా బాగా అప్‌డేట్ అయ్యారు కొరటాల. దేవరలో మనకు కనిపించింది అదే.

కార్తికేయ 2తో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిన చందూ మొండేటి తండేల్‌తో తొలిసారి భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా ఔట్ పుట్‌పై టీం అంతా నమ్మకంగా కనిపిస్తున్నారు. 2025, ఫిబ్రవరి 7న విడుదల కానుంది తండేల్.

హిట్ కోసం కొత్త ఇమేజ్ వైపు పరుగు తీస్తున్న దర్శకులు కొందరైతే.. యూనివర్స్‌లు క్రియేట్ చేస్తూ హిట్స్ ఇస్తున్నారు. వారిలో ఒకరు ప్రశాంత్ వర్మ. హనుమాన్‌తో యూనివర్స్ ఓపెన్ చేసిన ప్రశాంత్ వర్మ.. అధీర, జై హనుమాన్, మహాకాళి సినిమాల్ని ఇదే ప్రపంచంలో తీసుకొస్తున్నారు. మొత్తానికి ఏం చేసినా.. హిట్టు ముఖ్యం బిగిలూ అనేది మన దర్శకుల ఆలోచన.