
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ సతీమణి రూహీ నాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె గురువారం (ఫిబ్రవరి 15)న తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుగు సినీ పరిశ్రమ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

పలువురు టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సెంథిల్, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలియజేస్తున్నారు. అలాగే రూహీ ఆత్మకు శాంతి కలగాంటూ ప్రార్థిస్తున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి ఆస్థాన సినిమాటోగ్రాఫర్‌గా సెంథిల్ కుమార్‌కు పేరుంది టాలీవుడ్‌లో. జక్కన్న తెరకెక్కించిన ‘సై’, ‘ఛత్రపతి’, ‘యమదొంగ’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి 1’, ‘బాహుబలి 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలకు సెంథిల్ పనిచేశారు.

ఇక సెంథిల్, రూహీలది ప్రేమ వివాహం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా షూటింగ్ వీరిద్దరూ మొదటి సారి కలుసుకున్నారట.

ఆపై ఇరు పెద్దల ఆశీర్వాదంతో 2009లో పెళ్లిపీటలెక్కారు సెంథిల్, రూహీ. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.కాగా యోగా నిపుణురాలైన రూహీ పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీనటులకు యోగా పాఠాలు చెప్పారు.

సతీమణికి అనారోగ్యంగా ఉండటంతోనే సెంథిల్ కొద్ది రోజులుగా సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. అయతే గురువారం పరిస్థితి విషమించడంతో ఆమె కన్నుమూశారు. ఈరోజు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో రూహీ అంత్యక్రియలు జరగనున్నాయి.