
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ షాక్ నుంచి ఇంకా ఇండస్ట్రీ కోలుకోలేకపోతుంది. చాలా రోజుల తర్వాత క్రేజీ సినిమాలు వచ్చాయి.. బాక్సాఫీస్ కళకళలాడుతుందనుకున్న బయ్యర్ల కలలు కల్లలే అయ్యాయి. కాకపోతే చిన్న సినిమాలకు ఇదే వరంగా మారింది. ఈ వారం కూడా లో బడ్జెట్ సినిమాలే వచ్చేస్తున్నాయి. మరి అవేంటో రిలీజ్ ప్యాకేజ్‌లో చూసేద్దామా..?

కల్కి తర్వాత టాలీవుడ్‌కు కోరుకున్న సక్సెస్ ఇంకా రానేలేదు. మధ్యలో కమిటీ కుర్రోళ్లు, ఆయ్ లాంటి చిన్న సినిమాలు కంటెంట్‌తో కలెక్షన్లు కొల్లగొట్టాయి.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాయి.

ఈ గ్యాప్‌లో భారీ అంచనాలతో వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ దారుణంగా బెడిసికొట్టాయి. ప్రేక్షకులను ఇవి రెండు మెప్పించలేకపోయాయి. అయితే ఈ వారం మరోసారి చిన్న సినిమాలకు గోల్డెన్ ఆఫర్ ముందుంది.

ఆగస్ట్ 23న స్టార్ వ్యాల్యూ ఉన్న సినిమాలేవీ రావట్లేదు.. కానీ కంటెంట్‌ను నమ్ముకుని వచ్చేస్తున్నారు రావు రమేష్. ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న ఈ విలక్షణ నటుడు తొలిసారి హీరోగా నటించిన సినిమా మారుతినగర్ సుబ్రమణ్యం. లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్‌కు అల్లు అర్జున్, సుకుమార్ రావడంతో ఆసక్తి పెరిగింది.

మారుతినగర్ సుబ్రమణ్యంతో హిట్ కొడతానని గట్టిగా నమ్ముతున్నారు రావు రమేష్. మరోవైపు ఈ సినిమాకు పోటీగా డిమోంటీ కాలనీ 2 రానుంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడ్డాయి ఈ సినిమాకు. దీనికి మంచి రెస్పాన్స్ రావడం కలిసొచ్చే విషయం. రేవు, పరాక్రమం లాంటి సినిమాలు కూడా ఈ వారమే వస్తున్నాయి. మరి వీటిలో ఏది ఆడియన్స్‌ను మెప్పిస్తుందో చూడాలి.