
వాలెంటైన్ డే వచ్చిందంటే చాలు.. ప్రేమికుల కంటే ముందే థియేటర్‌కి వచ్చేస్తున్నారు రామ్ చరణ్. అప్పట్లో ఫ్లాప్ అయిన ఆరెంజ్ సినిమాను అదేపనిగా ప్రేమికుల రోజు నాడు విడుదల చేస్తూనే ఉన్నారు. గతేడాది మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా ఆరెంజ్ రీ రిలీజ్ అయింది.. తాజాగా మరోసారి రీ రీ రిలీజ్ చేసారు ఈ సినిమాను.

ఫస్ట్ టైమ్ రిలీజ్ అయినపుడు ఆరెంజ్ అర్థం కాలేదో ఏంటో కానీ ఇప్పుడు మాత్రం కల్ట్ క్లాసిక్ అంటూ ఎప్పుడొచ్చినా ఎగబడి మరీ చూస్తున్నారు ఆడియన్స్. మరోవైపు సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా అంతే. ఈ సినిమాను కూడా పదే పదే విడుదల చేస్తూనే ఉంటారు. తాజాగా మరోసారి థియేటర్స్‌లోకి వచ్చేసాడు సూర్య సన్నాఫ్ కృష్ణణ్.

సిద్ధార్థ్ సినిమాలు కూడా కొన్ని రీ రీ రిలీజ్ అవుతున్నాయి. అందులో అన్నింటికంటే ముందు చెప్పుకోవాల్సిన సినిమా ఓయ్. ఇది కూడా ఫస్ట్ టైమ్ విడుదలైనపుడు ఆడియన్స్‌కు అంతగా ఎక్కలేదు.

కానీ రానురాను ఓయ్‌పై ప్రేమ పెరిగిపోయింది. అందుకే అలా అకేషన్ దొరికిందో లేదో.. ఇలా ఓయ్ అంటూ వచ్చేస్తున్నాడు సిద్ధార్థ్. ఇవి మాత్రమే కాదు.. మూడేళ్ళ కింద వచ్చిన సీతా రామం సినిమాను కూడా ఇప్పటికే రెండుసార్లు రీ రిలీజ్ చేసారు. అలాగే సిద్ధార్థ్ క్లాసిక్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా కూడా రెండు మూడు సార్లు రీ రిలీజ్ అయింది.

తాజాగా రవితేజ నా ఆటోగ్రాఫ్‌ను రీ రిలీజ్ చేసారు. మొత్తానికి అకేషన్ చూసుకుని.. ఒకే సినిమాను మళ్లీ మళ్లీ రిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్.