
తెలుగు ఇండస్ట్రీని ఈ మధ్య నెమ్మదిగా కబ్జా చేస్తున్నారు తమిళ దర్శకులు. వరసగా మన హీరోలతో సినిమాలైతే చేస్తున్నారు కానీ ఎవరూ ఒక్క హిట్టు కూడా ఇవ్వట్లేదు.

లింగుసామి వారియర్, వెంకట్ ప్రభు కస్టడీ, శంకర్ గేమ్ ఛేంజర్.. ఇలా కొన్నేళ్లుగా తెలుగులో అట్టర్ ఫ్లాపులే ఇచ్చారు అరవ దర్శకులు. బ్రాండ్‌తో పనిలేకుండా డిజాస్టర్స్ ఇచ్చారు. తెలుగు హీరోలకు తమిళ దర్శకులు అంతగా కలిసిరాకపోయినా.. క్రేజీ కాంబినేషన్స్ మాత్రం సెట్ అవుతూనే ఉన్నాయి.

తాజాగా టాలీవుడ్ టాప్ హీరోలంతా కోలీవుడ్ దర్శకులకు రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్ కనకరాజ్ ఇప్పటికే ప్రభాస్‌తో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసారు కూడా. ప్రస్తుతం ఈయన కూలీతో బిజీగా ఉన్నారు.

జైలర్ ఫేమ్ నెల్సన్ కూడా టాలీవుడ్‌పై బాగానే ఫోకస్ చేసారు. ఈయన ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా జైలర్ 2 చేస్తున్నారు. 2025లోనే షూటింగ్ పూర్తి చేసి.. సమ్మర్ 2026 విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌తో నెల్సన్ సినిమా ఉండబోతుంది. ఈలోపు వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమాలు పూర్తి చేయనున్నారు తారక్.

జవాన్‌తో 1000 కోట్ల హిట్ కొట్టిన అట్లీ.. ఏడాదిన్నరగా మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకురాలేకపోయారు. బాలీవుడ్‌లో ఓ బడా కాంబో సెట్ చేయాలని చూసినా వర్కవుట్ కాలేదు. దాంతో అల్లు అర్జున్ వైపు చూస్తున్నారు అట్లీ. ఇక డాన్ ఫేమ్ శిబి చక్రవర్తి, నాని, మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్‌లో ఓ క్రేజీ సినిమా రాబోతుంది. మొత్తానికి టాలీవుడ్‌ను మెల్లగా కమ్మేస్తున్నారు కోలీవుడ్ దర్శకులు.