
ఒకసారి తెలియక తప్పు చేస్తే పొరపాటు అంటారు.. కానీ అదే తప్పు మళ్లీ మళ్లీ చేస్తుంటే అది కచ్చితంగా అలవాటే. ఇప్పుడదే చేస్తున్నారు తమిళ హీరోలు. వీళ్లు చూస్తున్నారులే అని తెలుగు ఆడియన్స్‌ని మరీ తక్కువంచనా వేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వీళ్ళకిదే ఎక్కువలే అని అవమానిస్తున్నారు కూడా. తాజాగా రజినీకాంత్ కూడా ఇదే లిస్టులో చేరిపోయారు.

తమిళ హీరోల తీరు చూసాక.. తెలుగు ఆడియన్స్ ఇదే అడుగుతున్నారిప్పుడు. చూడ్డానికి కాస్త కామెడీగా ఉంది కానీ సీరియస్ మ్యాటర్ ఇది. తమిళ హీరోలకు, నిర్మాతలకు తెలుగు కలెక్షన్లు కావాలి కానీ తెలుగు టైటిల్ మాత్రం పెట్టరు.

మనకు అర్థం కాని అదే తమిళ టైటిల్‌నే తెలుగులోనూ పెడుతుంటారు.. చూస్తే చూడండి లేకపోతే లేదన్నట్లు..! ఒక్కసారి అంటే ఏమో అనుకోవచ్చు కానీ.. మళ్లీమళ్ళీ అదే తప్పు చేస్తున్నారు తమిళ హీరోలు. ఎవరివరకో ఎందుకు.. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా తెలుగులో టైటిలే దొరకనట్లు వేట్టయన్ అంటూ తమిళ టైటిల్‌తోనే వస్తున్నారు. అక్టోబర్ 10న ఇది విడుదల కానుంది.

గతంలో అజిత్ కూడా వలిమై, తునివు అంటూ మనకు సంబంధమే లేని టైటిల్స్‌తో వచ్చారు. మొన్నటికి మొన్న విక్రమ్ నటించిన తంగలాన్‌ది ఇదే పరిస్థితి. అదేంటని అడిగితే అదో తెగ పేరు.. మార్చడం కుదరదన్నారు.

ఇప్పుడు సూర్య కంగువాకు ఇదే కారణం చెప్తున్నారు. ఆ మధ్య జిగర్తాండ డబుల్ ఎక్స్‌కు సేమ్ రీజన్ చెప్పారు. తమిళంలో మన సినిమాలను ఇలాగే తెలుగు టైటిల్స్‌తో విడుదల చేస్తే అక్కడి ఆడియన్స్ చూస్తారా..? అది తమిళ హీరోలే ఆలోచించుకోవాలి.