
టాలెంట్ టన్నుల్లో ఉన్నా.. ఆవగింజంత అదృష్టం కోసం వేచి చూస్తున్నారు హీరో సూర్య. సూపర్ క్రేజ్ ఉంది.. అదిరిపోయే మార్కెట్ ఉంది.. అన్నింటికీ మించి అద్భుతమైన నటుడు.. అయినా కూడా కోరుకున్న విజయమే ఈ మధ్య రావట్లేదు.

కొన్నేళ్లుగా సరైన సక్సెస్ కోసం చూస్తున్నారు సూర్య. వచ్చే సినిమాలు వస్తూనే ఉన్నాయి గానీ ఒక్కటీ ఆడట్లేదు.. ఆడిన సినిమాలేమో ఓటిటికి వెళ్లిపోయాయి. జై భీమ్, ఆకాశమే నీ హద్దురా లాంటి సినిమాలకి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చినా అవి థియెట్రికల్ రిలీజ్ కావు.

భారీ అంచనాల మధ్య వచ్చిన కంగువా కనీసం మూడు రోజులు కూడా ఆడలేదు. ప్రస్తుతం సూర్య ఆశలన్నీ రెట్రో సినిమాపైనే ఉన్నాయి. కార్తిక్ సుబ్బరాజ్ ఈ సినిమాకు దర్శకుడు. ఈయనకు సరైన హిట్ వచ్చి కొన్నేళ్ళైపోయింది.

రెట్రోలో సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ప్రస్తుతం పూజా కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. ఇలా సూర్య, పూజా, కార్తిక్ సుబ్బరాజ్.. రెట్రో టీం అంతా ఫ్లాపుల్లోనే ఉన్నారు. అలాగని సూర్యని తక్కువంచనా వేయడానికి లేదు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్ల వర్షం కురిపిస్తారు సూర్య. ఈసారి రెట్రోతో అదే జరగాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.

రెట్రో సినిమాను తెలుగులో సితార ఎంటర్‌టైన్మెంట్స్‌పై లక్కీ ప్రొడ్యూసర్ నాగవంశీ విడుదల చేస్తున్నారు. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. 2 గంటల 48 నిమిషాల నిడివితో రెట్ర్ రిలీజ్‌కు రెడీ అయింది. మరి ఈ సినిమాతో అయినా సూర్య కష్టాలు తీరిపోతాయేమో చూడాలిక.