
సంక్రాంతికి ఒక్క సినిమాకు డేట్ అడ్జస్ట్ చేయబోయి.. నిర్మాతల మండలికి కొత్త తలనొప్పులు చుట్టుకుంటున్నాయిప్పుడు. జనవరి 13 నుంచి ఈగల్‌ను సక్సెస్ ఫుల్‌గా ఫిబ్రవరి 9కి వాయిదా వేయించారు బానే ఉంది.

కానీ దాని పర్యావసానమే ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆ రోజు రావాల్సిన డిజే టిల్లు సీక్వెల్ మార్చ్ 29కి వెళ్లిపోయింది.. ఇప్పుడు ఊరి పేరు భైరవకోన కూడా వాయిదా పడుతుంది. ఇకపై సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ నిర్మాతల మండలిని అడిగి తీసుకోవాలేమో అనిపిస్తుందిప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తుంటే.

సంక్రాంతి పోటీ తగ్గించడం కోసం దిల్ రాజు ఓ మాటిచ్చారు.. దానికోసం నానా కష్టాలు పడుతున్నారిప్పుడు. టిల్లు స్వ్వేర్ వాయిదాకు నాగవంశీ ఈజీగానే ఓకే అన్నా.. ఊరిపేరు భైరవకోన వాయిదా కోసం నిర్మాతల మండలి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఫిబ్రవరి 9 నుంచి 16కి ఊరిపేరు భైరవకోన వాయిదా పడటంతో.. ఆ రోజు రావాలనుకున్న వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలంటైన్ ఫిబ్రవరి 25కి వెళ్లిపోయింది. గోపీచంద్ భీమా రిలీజ్ డేట్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే అది కూడా ఫిబ్రవరి 16నే రావాల్సి ఉంది. అదేరోజు వైవా హర్ష నటిస్తున్న సుందరం మాస్టారు కూడా విడుదల కానుంది.

ఫిబ్రవరి 8న యాత్ర 2 షెడ్యూల్ ప్రకారమే వస్తుండగా.. ఇచ్చిన మాట ప్రకారం ఫిబ్రవరి 9న మాత్రం ఈగల్ తప్ప మరో సినిమా రాకుండా చూసుకుంటుంది నిర్మాతల మండలి. తమను అడక్కుండా సోలో డేట్ ఇప్పిస్తామనే మాట ఎలా ఇస్తారంటూ.. ప్రొడ్యూసర్ కౌన్సిల్‌పై ఇతర నిర్మాతలు అసంతృప్తిగా ఉన్నారు. ఈ సోలో డేట్ వ్యవహారం ఈగల్‌తోనే అయిపోతుందా లేదా ఇకపై కంటిన్యూ అవుతుందా చూడాలిక.