
మేం బాగా బిజీ అంటున్నారు ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు. ఈ మధ్య కనిపించట్లేదని మేం ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారేమో.. గ్యాప్ వచ్చింది కెరీర్ అయిపోయింది అనుకుంటున్నారేమో.. అలాంటిదేం లేదు చిన్న గ్యాప్ ఇచ్చాం.. గ్యాప్ లేకుండా కుమ్మేస్తాం అంటున్నారు కొందరు ముద్దుగుమ్మలు. మరి మన ఇండస్ట్రీలో ఆ స్థాయిలో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరు..?

భీమ్లా నాయక్.. బింబిసార.. సార్.. విరూపాక్ష లాంటి సినిమాలతో తనదైన మార్క్ క్రియేట్ చేసుకున్న సంయుక్త మీనన్.. రెండేళ్లుగా కనిపించట్లేదు. అలాగని కెరీర్ అయిపోయిందేమో అనుకుంటే పొరపాటే.

ప్రస్తుతం ఈ భామ చేతిలో అరడజన్ సినిమాలున్నాయి.. అఖండ 2, స్వయంభు, బెంజ్, నారినారి నడుమ మురారి, హైందవంతో పాటు పూరీ, విజయ్ సేతుపతి సినిమాలోనూ నటిస్తున్నారు. రెండేళ్ల గ్యాప్ తీసుకున్నా.. మరో రెండేళ్ల వరకు తానొక్కరే కనిపించేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్నారు సంయుక్త మీనన్.

మరోవైపు భాగ్యశ్రీ బోర్సే కూడా అంతే. మిస్టర్ బచ్చన్ తర్వాత ఏడాదిగా మాయమైనా.. రాబోయే ఏడాది మొత్తం భాగ్య దర్శనమే కానుంది. విజయ్ దేవరకొండ కింగ్డమ్‌తో పాటు దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్రా కింగ్ తాలూక సినిమాలు చేస్తున్నారు ఈ బ్యూటీ.

డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్ సైతం టాలీవుడ్‌లో జెండా పాతేస్తున్నారు. తెలుగులో మూడేళ్ల కింద అల్లూరి సినిమా చేసిన ఈమె.. తాజాగా వరస ఛాన్సులు అందుకుంటున్నారు. విశ్వక్ సేన్ ఫంకీలో నటిస్తున్నారీమే. శ్రీలీల కూడా చిన్న బ్రేక్ ఇచ్చి.. రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్‌తో పాటు రవితేజ మాస్ జాతర, కిరీటీ జూనియర్ సినిమాలతో రానున్నారు.