
డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో పృథ్విరాజ్ రోల్ గుర్తుంది కదా! డైరక్టర్ ప్రశాంత్ నీల్ కోవిడ్‌కి ముందే ఆ కేరక్టర్‌ని పృథ్విరాజ్‌కి ఎక్స్ ప్లయిన్ చేశారు. ప్రశాంత్ డైరక్షన్‌లో ప్రభాస్ నటిస్తారంటూ గాసిప్స్ నడుస్తున్న టైమ్ అట అది. కథ వినగానే పృథ్విరాజ్‌కి నచ్చేసింది. వెంటనే ఓకే చెప్పేశారు. కానీ, కోవిడ్ కారణంగా ఇంటర్నేషనల్ లాక్‌డౌన్ పడింది. అప్పుడు పృథ్వి ఎక్కడో ఫారిన్‌లో ఆడుజీవితం సినిమా షూటింగ్ చేస్తున్నారు.

అక్కడ షూటింగ్ మధ్యలో ఉంది. ఆ మూవీ కోసం పెంచిన గడ్డాన్ని తీయలేరు. అందుకే ప్రశాంత్ దగ్గరకు వెళ్లి 'సారీ.... నేను చేయలేను. ఇంకొకరిని చూసుకో' అని చెప్పేశారు. ప్రశాంత్ నీల్ ఓపిగ్గా విన్నారే తప్ప, స్పందించలేదు. లాక్‌డౌన్ అంతా పూర్తయ్యాక పృథ్విరాజ్‌కి ఫోన్ చేసి, డార్లింగ్ ఫ్రెండ్‌గా మిమ్మల్ని తప్ప ఇంకెవరినీ ఊహించుకోలేకపోతున్నాను. మీ కాల్షీట్ ఉన్నప్పుడే చెప్పండి.. నేను షూటింగ్ ప్లాన్ చేసుకుంటా అని అన్నారట. అలా... సెట్ అయింది సలార్ కాంబో!

వారెవా... కేక అనే రేంజ్‌లో పేరు వచ్చిన తర్వాత పుసుక్కున చేతిలో సినిమాల్లేని రోజు వస్తుందని అసలు ఊహించి ఉండరు పూజా హెగ్డే. మబ్బుని చూసి ముంత ఒలకబోసుకున్నట్టు, బాలీవుడ్ ఆఫర్లను చూసి, సౌత్ ప్రాజెక్టులను పట్టించుకోలేదు ఈ బ్యూటీ. ఇప్పుడు అక్కడా లేదు, ఇక్కడా లేదు అన్నట్టుంది పరిస్థితి. అయినా కూడా ఒక్క హిట్, ఒకే ఒక్క హిట్ చాలు... నేను బౌన్స్ బ్యాక్ కావడానికి అని అంటున్నారు పూజా. అంతేనా, గ్రే కేరక్టర్లు చేయాలని ఉందని చెబుతున్నారు. మనుషుల్లో కూడా పూర్తిగా తెలుపు, పూర్తిగా నలుపు ఉండదు. పరిస్థితులను బట్టి, అటూ ఇటూ మారుతూ ఉంటారు. అలాంటి ఒరిజినల్ కేరక్టర్లు సినిమాల్లోనూ చాలా ఉంటాయి. నాకు అలాంటి కేరక్టర్ బేస్డ్ సినిమాల్లో కనిపించాలని ఉంది. అందులోనూ నాలాగా సక్సెస్ అయిన అమ్మాయిల గురించిన మోడ్రన్ స్టోరీస్ స్క్రీన్ మీద చెప్పాలని ఉంది అని అంటున్నారు పూజా హెగ్డే.

హీరోయిన్లు కెరీర్‌లో ఫేస్ చేసిన విషయాలను ఎక్స్ పీరియన్సులుగా మార్చి చెబుతున్నప్పుడు, ఎవరికైనా కాస్త ఓపిగ్గా వినాలనిపిస్తుంది. అంత ఆసక్తిగా ఉంటాయి మరి ఆ విషయాలు. రీసెంట్‌గా అలాంటి ఓ స్టోరీని చెప్పారు మృణాల్ ఠాకూర్. ఓ డైరక్టర్ మృణాల్‌ని చూసి, 'నేను నిన్ను ఎప్పుడూ ఇలా చూడలేదు, అలాంటి కేరక్టర్‌కి ఎలా పనికొస్తావో ఏమో...' అని అన్నారట. 'ముందు మేకోవర్ అవుతాను. ఆ తర్వాత చూడండి' అని చెప్పారట మృణాల్.

నయా లుక్‌లో ఆమెను చూసి, 'ఇలా ఎప్పుడూ కనిపించలేదే' అని మెస్మరైజ్ అయ్యారట ఆ డైరక్టర్. ఆ విషయాన్నే గుర్తుచేసుకున్నారు మృణాల్. 'నేను రా మెటీరియల్ లాంటి దాన్ని. ఏ డైరక్టర్ కోసం ఎలా మౌల్డ్ అవ్వాల్సి వస్తే, అలా అవుతాను. నా మేకప్, హెయిర్ ఆర్టిస్టులు అంత గొప్పవారు. వాళ్ల కృషిని నేనెప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటాను' అని అన్నారు సిల్వర్‌స్క్రీన్ సీత.