
ఓజి గురించి ఒక్క అప్‌డేట్ తెలిస్తేనే చాలు అని వేచి చూస్తున్న పవన్ ఫ్యాన్స్‌కు ఏకంగా ఫుల్ మీల్స్ పెట్టినంత పని చేసారు సుజీత్. ఒకే ఒక్క ఇంటర్వ్యూలో అభిమానులు కోరుకుంటున్న అన్ని విషయాలు చెప్పారు.

అసలు ఓజి షూటింగ్ ముచ్చట్లేంటి..? ఎప్పుడు వస్తుంది..? ట్రైలర్ కట్ చేసారా..? ఇలా ఒక్కటేంటి అన్నీ చెప్పేసారు సుజీత్. మరి ఆయనేం చెప్పారో చూద్దామా..? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు కానీ అందరి ఫోకస్ మాత్రం ఓజిపైనే ఉంది.

కారణమేదైనా ఈ మధ్య ఎక్కువగా రీమేక్స్ చేస్తున్న పవన్.. చాలా రోజుల తర్వాత చేస్తున్న ఒరిజినల్ సినిమా OG. అందుకే టీజర్ రిలీజ్ నుంచే దీనిపై అంచనాలు ఆకాశమంత పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ 70 శాతం పూర్తైంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇంకా సెట్స్‌పైనే ఉంది ఓజి.

2 వారాలు పవన్ డేట్స్ ఇస్తే చాలు ఈ సినిమా పూర్తైపోతుంది. ఓజిపై ఒక్క అప్‌డేట్ వస్తే చాలు అనుకుంటున్న ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టారు సుజీత్. కార్తికేయ భజే వాయు వేగం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సుజీత్ ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే ఓజి ముచ్చట్లు ఫ్యాన్స్‌కు చెప్పారు.

టైటిల్‌లోనే జపనీస్ లింక్ చూపించారు సుజీత్. ఇప్పుడు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఓజిలో జపనీస్ రిఫరెన్సులు ఉంటాయని.. కొన్ని యాక్షన్ సీక్వెన్సులు పవన్ స్వయంగా దగ్గరుండి డిజైన్ చేసారని తెలిపారు సుజీత్. ట్రైలర్ ఇప్పటికే కట్ చేసామని.. రిలీజ్‌కు ముందు విడుదల చేస్తామంటూ చెప్పుకొచ్చారు ఈ దర్శకుడు. సెప్టెంబర్ 27న ఓజి విడుదల కానుంది.