
ఏం చేసినా కలిసిరావట్లేదు.. ఎలాంటి సినిమా చేసినా హిట్ కావట్లేదు.. ఏం చేయాలో తెలియక కంగారు పడుతున్నారు వరుణ్ తేజ్. ఈ కన్ఫ్యూజన్‌లో ఆయన నుంచి వస్తున్న సినిమా ఆపరేషన్ వాలంటైన్. దీనిపై అంచనాల సంగతి పక్కనబెడితే.. మెగా ప్రిన్స్ కెరీర్ ఆధారపడి ఉంది. అసలెందుకు ఈ చిత్రం ఆయనకు అంత కీలకంగా మారింది..?

కెరీర్ ఆరంభం నుంచీ తనదైన రీతిలో సత్తా చాటుతోన్న అతడు.. వరుస చిత్రాలతో వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక ఇబ్బందులు పడుతోన్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గని, గాండివధారి అర్జున అంటూ ఇలా ప్రయోగాలు చేస్తున్నాడు బోల్తా కొడుతున్నాడు. ఎఫ్ 2, ఎఫ్ 3లు వసూళ్లు సాధించినా.. ఆ హిట్టు క్రెడిట్ వరుణ్ తేజ్ ఖాతాల్లోకి రాదు.

వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఆపరేషన్ వాలంటైన్ ట్రైలర్ విడుదలైంది. ఇది చూస్తుంటే హిట్ కళ కనిపిస్తుంది. శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు వరుణ్. ఇండో పాక్ నేపథ్యంలోనే ఈ సినిమా వస్తుంది. ట్రైలర్‌లోనే కథ అంతా చెప్పేసారు దర్శకుడు శక్తి ప్రతాప్. వరుణ్ ట్రాక్ రికార్డుతో పనిలేకుండా బడ్జెట్ భారీగా పెట్టారు.

ఆపరేషన్ వాలంటైన్ వరుణ్ తేజ్ కెరీర్‌కు అత్యంత కీలకంగా మారింది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు ఈ మెగా హీరోకు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఎఫ్ 3 యావరేజ్ దగ్గరే ఆగింది. ఇక గని, గాంఢీవదారి అర్జున కూడా డిజాస్టర్ అయ్యాయి. దాంతో వరుణ్ మార్కెట్ పడిపోయింది. ఈ ప్రభావం ప్రస్తుతం సెట్స్‌పై ఉన్న మట్కాపై పడింది.

కరుణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియన్ ప్రాజెక్ట్‌గా మొదలైన మట్కాకు బడ్జెట్ ఇష్యూస్ వచ్చినట్లు తెలుస్తుంది. ఆపరేషన్ వాలంటైన్ హిట్టైతే.. మట్కాకు మనీ ప్రాబ్లమ్స్ తొలిగిపోయినట్లే. లేదంటే మాత్రం వరుణ్ తేజ్ కెరీర్‌కు కష్టాలు కంటిన్యూ అవుతాయి. మార్చ్ 1న తెలుగుతో పాటు హిందీలో విడుదల కానుంది ఆపరేషన్ వాలంటైన్. చూడాలిక.. ఈ చిత్రంతో వరుణ్ ఏం మ్యాజిక్ చేస్తారో..?