
వినాయక చవితి సెప్టెంబర్ 18.. ఆ రోజు గవర్నమెంట్ హాలీడే. దానికి ముందు మూడు రోజుల వీకెండ్.. ఓ సినిమా విడుదల చేయడానికి అంతకంటే మంచి సీజన్ ఉంటుందా..? కానీ మనోళ్లేమో అనవసరంగా ఈ వీకెండ్ అంతా వదిలేసారు.

వస్తామని చెప్పిన ఏ ఒక్కరూ రావట్లేదు. మూన్నెళ్ళ కింద సెప్టెంబర్ 15 కోసం కనిపించిన పోటీ ఇప్పుడు లేదు.. స్కంద, టిల్లు స్క్వేర్‌తో పాటు చంద్రముఖి 2 కూడా వాయిదా పడింది.

వినాయక చవితి వీకెండ్‌ను పూర్తిగా గాలికి వదిలేసాయి మన తెలుగు సినిమాలు. సలార్ పోస్ట్ పోన్ కావడంతో ఆ డేట్ కోసం అంతా ఎగబడుతున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ 28కి స్కంద వెళ్లింది.. అదే రోజు చంద్రముఖి 2 కూడా రాబోతుందని తెలుస్తుంది.

సిజి వర్క్‌లో ఆలస్యం కారణంగా సెప్టెంబర్ 15న ఈ సినిమా రావట్లేదు. ఇక డిజే టిల్లు సీక్వెల్ మరో డేట్ చూసుకుంది. దాంతో విశాల్ మార్క్ ఆంటోనీ ఒక్కటే వినాయక చవితికి వచ్చే సినిమా.

విశాల్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది.. పైగా ఆప్షన్ కూడా లేదు కాబట్టి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా మార్క్ ఆంటోనీకి మంచి వసూళ్లు ఖాయం.

మరోవైపు ఈ వారం విడుదలైన జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలకు మంచి టాక్ వచ్చింది. ముఖ్యంగా జవాన్ అయితే తెలుగులో కూడా దుమ్ము దులిపేస్తుంది. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కు మిస్ శెట్టి బాగా ఎక్కేసింది. వీటికి నెక్ట్స్ వీక్ కలిసి రానుంది.