తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులు ఉంటారు.. వాళ్ళు చేసింది ఎన్ని సినిమాలు అని కాదు.. ఎలాంటి సినిమాలు చేశారు అనేది మాత్రమే ప్రేక్షకులు గుర్తుపెట్టుకుంటారు. అలా మాత్రమే గుర్తుండిపోయిన ఒక దర్శకుడు కే విజయభాస్కర్. ఒకప్పుడు ఈయన పేరు సెన్సేషనల్. ఆయన పేరు పోస్టర్ మీద కనిపించింది అంటే పక్కా బ్లాక్ బస్టర్ అనే నమ్మకం ఉండేది. అప్పట్లో ఆయన చేసిన సినిమాలు కూడా అలాగే ఉన్నాయి.
స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, మల్లీశ్వరి అంటూ మిలీనియం టైంలో బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకున్నాడు విజయభాస్కర్. జై చిరంజీవ వరకు విజయభాస్కర్ సినిమాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా ఫామ్ కోల్పోయాడు ఈయన. అప్పటివరకు తన ఆలోచనలకు ప్రాణంగా ఉన్న త్రివిక్రమ్ దూరమైపోవడంతో విజయభాస్కర్ కూడా విజయాలకు దూరమైపోయాడు.
త్రివిక్రమ్ ఆయన నుంచి విడిపోయి దర్శకుడుగా మారిన తర్వాత విజయ్ భాస్కర్ లక్ కూడా పోయింది. త్రివిక్రమ్ పెన్నుతో పాటే విజయాలు కూడా దూరం అయిపోయాయి. ఆయన దూరమైన తర్వాత భలే దొంగలు, మసాలా లాంటి సినిమాలు చేసినా కూడా అవి వచ్చినట్టు కూడా ప్రేక్షకులకు తెలియదు.
మొన్నటికి మొన్న తన కొడుకును హీరోగా పరిచయం చేస్తూ జిలేబి అనే సినిమా చేశాడు విజయ్ భాస్కర్. అది కూడా అంతే. వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు ఆ సినిమాకు సపోర్ట్ చేసినా.. కనీసం విడుదలైన సంగతి కూడా ఆడియన్స్ కు ఐడియా లేదు. ఇలాంటి సమయంలో విజయభాస్కర్ పని పూర్తిగా అయిపోయిందని అందరూ ఫిక్స్ అయిపోయారు.
అయితే తాను ఇంకా రేసులోనే ఉన్నాను అని చెప్పడానికి మరో సినిమాను మొదలు పెట్టాడు ఈ దర్శకుడు. ఉషా పరిణయం అంటూ కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు విజయభాస్కర్. శ్రీ కమల్, తాన్వి ఆకాంక్ష, సూర్య ఇందులో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తన జోనర్ లోనే కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉషా పరిణయం వస్తుంది. ఈ సినిమాతో మళ్లీ తన కమ్ బ్యాక్ ఉంటుందని నమ్మకంగా చెప్తున్నాడు విజయ భాస్కర్. అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.