
టాలీవుడ్‌కు మంచి రోజులు రాబోతున్నాయా..? మంచి రోజులు రావడమేంటి.. అంటే ఇప్పుడు బాలేవా అనుకోవచ్చు. ఎక్కడ బాగున్నాయో మీరే ఆలోచించండి.. సంక్రాంతి తర్వాత స్టార్ హీరోలు సరైన బ్లాక్‌బస్టర్ ఇచ్చి ఎన్నాళ్లైందో..? ఆశలు పెట్టుకున్న చిరు, ప్రభాస్, పవన్ కళ్యాణ్ కూడా నిరాశనే మిగిల్చారు. అయితే రానున్న 365 రోజుల్లో ప్రతీ సీజన్‌లోనూ కనీసం రెండు మూడు భారీ సినిమాలు రాబోతున్నాయి. అవేంటో ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీలో చూద్దాం..

సిక్సర్‌తో ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. సడన్‌గా వికెట్లు పారేసుకున్న క్రికెట్ టీంలా అయిపోయిందిప్పుడు మన టాలీవుడ్ పరిస్థితి. చిరంజీవి, బాలయ్య సంక్రాంతిని విజయంతో మొదలు పెడితే.. తర్వాత కంటిన్యూ చేయడానికి హీరోలే కరువయ్యారు. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఒక్కరంటే ఒక్క స్టార్ హీరో కూడా రాలేదు. నాని, రవితేజ, సాయి ధరమ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరోలతోనే సమ్మర్ అంతా గడిచిపోయింది.

జూన్ 16న ఆదిపురుష్‌తో ప్రభాస్ వచ్చారు. అయితే అది కూడా నిరాశ పరిచింది. ఇక జులై 28న బ్రో అంటూ పలకరించినా పరాజయమే ఎదురైంది. ఇక ఆగస్ట్ 11న వచ్చిన భోళా శంకర్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన చిరునే.. భోళాతో డిజాస్టర్ ఇచ్చారు. మొన్నటికి మొన్న విజయ్ దేవరకొండ ఖుషీతో వచ్చారు. సెప్టెంబర్ 28న స్కందతో రామ్ వస్తున్నారు.

సెప్టెంబర్ 28న రావాల్సిన సలార్ నవంబర్ 10న వచ్చేలా కనిపిస్తుంది. ఇక అక్టోబర్ 19న దసరా సందర్భంగా భగవంత్ కేసరిగా బాలయ్య రాబోతున్నారు.. అదే రోజు విజయ్ లియో విడుదల కానుంది. ఇక దసరా సీజన్‌లోనే రవితేజ టైగర్ నాగేశ్వరరావు విడుదల కానుంది. డిసెంబర్‌లో నాని హాయ్ నాన్నతో పాటు వెంకటేష్ 75వ సినిమా సైంధవ్ రానున్నాయి. ఓజి కూడా డిసెంబర్ లేదంటే సంక్రాంతికి రానుంది.

సంక్రాంతి 2024కి పెద్ద యుద్ధమే జరుగుతుంది. మహేష్ గుంటూరు కారం, ప్రభాస్ ప్రాజెక్ట్ కే, రవితేజ ఈగిల్, విజయ్ దేవరకొండ పరుశురామ్ సినిమా, నాగార్జున నా సామిరంగా లాంటి సినిమాలు రానున్నాయి. వీటిలో ఏది చివరి వరకు రేసులో ఉంటుందో మరి. ఇక సమ్మర్‌లో డబుల్ ఇస్మార్ట్, దేవర, పుష్ప 2, ఉస్తాద్ భగత్ సింగ్, గేమ్ ఛేంజర్ రానున్నాయి. ఇలా సెప్టెంబర్ 2023 నుంచి 2024 ఆగస్ట్ వరకు సినీ జాతరే జరగనుంది.