
హీరోగా వరస ఫ్లాపులు రావడంతో రవితేజ ఆలోచనలు మారిపోతున్నాయా..? ఇకపై హీరోగానే కాకుండా.. మరో విధంగానూ తన సత్తా చూపించాలని ఫిక్సైపోయారా..?

ఇన్నాళ్లూ టాలీవుడ్‌లోనే మాస్ జాతర చూపించిన రవితేజ.. ఇకపై పక్క ఇండస్ట్రీల్లోనూ పాగా వేయాలని చూస్తున్నారా..? అసలు మాస్ రాజా ప్లానింగ్ ఏంటి..? ఆయనేం చేయబోతున్నారు..?

రవితేజకు ఒకప్పుడు ఉన్న మార్కెట్ గానీ.. క్రేజ్ గానీ ఇప్పుడు లేవనేది కాదనలేని వాస్తవం. అలాగని పూర్తిగా రవితేజ ఇమేజ్ తగ్గిపోయిందని కాదు..

ఇప్పటికీ ఆయనకు సరిపోయే సినిమా పడిందంటే బాక్సాఫీస్ దగ్గర మాస్ జాతర సృష్టిస్తాడు రవితేజ. అన్నట్లు కొత్త దర్శకుడు భాను భోగవరపుతో రవితేజ చేస్తున్న సినిమా టైటిల్ కూడా మాస్ జాతరే.

పైగా ఇది ఆయన 75వ సినిమా. మాస్ జాతరలో శ్రీలీలతో జోడీ కడుతున్నారు రవితేజ. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ధమాకా క్రియేట్ చేసిన మ్యాజిక్ అందరికీ తెలిసిందే.

రవితేజ తిరిగి ఫామ్‌లోకి రావాలంటే.. మాస్ జాతర హిట్ కీలకంగా మారింది. ఇదిలా ఉంటే.. మాస్ రాజా ఓ తమిళ సినిమాలో నటించబోతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. అదేంటో కాదు సూర్య 45.

ఆర్జే బాలాజీ ఈ సినిమాకు దర్శకుడు. సూర్య 45 ఈ మధ్యే మొదలైంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం రవితేజ అయితే బాగుంటాడని భావిస్తున్నారు మేకర్స్. మాస్ రాజా దగ్గరికి ఈ ప్రపోజల్ వచ్చిందని తెలుస్తుంది.

రెండేళ్ళ కింద వాల్తేరు వీరయ్యలో చిరు కోసం ఓ సపోర్టింగ్ రోల్ చేసారు రవితేజ. కథ నచ్చితే సూర్య కోసం ఇదే చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మరి చూడాలిక.. రవితేజ, సూర్య కాంబో వర్కవుట్ అవుతుందో లేదో..?