
అంతా అనుకున్నదే.. కాకపోతే కాస్త ఆలస్యంగా చెప్పారు కొరటాల శివ. ముందు నుంచి చెప్తున్నట్లుగానే దేవర వాయిదా పడింది. సమ్మర్ వదిలేసినా.. మరో సాలిడ్ సీజన్‌పై కన్నేసారు తారక్. మరోవైపు అబ్బాయితో పోటీకి సై అంటున్నారు బాబాయ్. మరి దేవరను వెన్నంటే.. బాలయ్య కూడా వస్తున్నారా..? అదే నిజమైతే.. బాబాయ్ అబ్బాయ్ బాక్సాఫీస్ ఫైట్ ఎప్పుడు ఉండబోతుంది..?

దేవర సినిమా వాయిదాపై క్లారిటీ వచ్చేసింది. చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే.. ఎప్రిల్ 5 నుంచి ఏకంగా 6 నెలలు పోస్ట్ పోన్ అయిపోయింది దేవర. సమ్మర్ సీజన్ మిస్ చేసుకున్నా.. సాలిడ్ సీజన్‌పై కన్ను వేసారు తారక్. దసరాకు దేవర విడుదల కానున్నట్లు ఖరారు చేసారు మేకర్స్. అక్టోబర్ 10న ఈ చిత్రం విడుదల కానుంది.

కర్ణుడి చావుకు లక్ష కారణాలన్నట్లు.. దేవర వాయిదాకు చాలా రీజన్స్ కనిపిస్తున్నాయి. అందులో మొదటిది.. అందరూ హైలైట్ చేస్తున్నది ఏపీ ఎన్నికలు. ఆ సమయంలో దేవరను తీసుకొస్తే.. లేనిపోని ఇబ్బందులు అన్నట్లు ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు అనిరుధ్ ఇప్పటి వరకు ఒక్క పాట కూడా ఇవ్వలేదు.. దాంతో షూట్ కూడా అవ్వలేదు.

దేవరకు 4 పాటలు బ్యాలెన్స్ ఉన్నారు అనిరుధ్. వీటి షూటింగ్‌కు కనీసం నెల రోజులైనా పడుతుంది. మరోవైపు టాకీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే వాయిదా వేసుకోవడమే మంచిదని నిర్ణయించారు మేకర్స్. దసరా అక్టోబర్ 12 అయితే.. దానికి రెండ్రోజుల ముందే వచ్చేస్తుంది దేవర. అయితే బాలయ్య, బాబీ సినిమా సైతం దసరాకే టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

2023లో దసరాకే భగవంత్ కేసరితో వచ్చి హిట్ కొట్టారు బాలయ్య. అదే సెంటిమెంట్ బాబీ సినిమాకు అప్లై చేయాలని చూస్తున్నారు. ఇదే జరిగితే బాబాయ్, అబ్బాయ్ వార్ తప్పదు. నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ కూడా ఒకేరోజు గ్యాప్‌లో 2016 సంక్రాంతికి వచ్చాయి. ఈసారి దసరాకు సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. మొత్తానికి చూడాలిక.. దేవరతో NBK 109 పోరు ఎలా ఉండబోతుందో..?