
బాలయ్య కెరీర్‌లో ఎన్ని సినిమాలైనా ఉండనీ కానీ అఖండ మాత్రం ప్రత్యేకం. ఎందుకంటే దానికి ముందు కూడా బాలయ్య హిట్లు, సూపర్ హిట్లు కొట్టారు కానీ మార్కెట్ మాత్రం అక్కడక్కడే ఉంది. కానీ అఖండ తర్వాతే నట సింహం రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అప్పటి వరకు 50 కోట్ల దగ్గరే ఆగిన బాలయ్య సినిమాలు.. అఖండ తర్వాత 100 కోట్లకు తగ్గనంటున్నాయి.అఖండతో తొలిసారి 100 కోట్లు కొట్టిన బాలయ్య.. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూ మహారాజ్ సినిమాలతో వరసగా నాలుగు సార్లు 100 కోట్లు అందుకున్న తొలి సీనియర్ హీరోగా చరిత్ర సృష్టించారు.

అఖండ 2తో ఏకంగా 200 కోట్లపై కన్నేసారు బాలయ్య. బోయపాటి అండగా ఉండటంతో.. అఖండ 2 ఆ రికార్డు అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారీయన.అఖండ 2 షూటింగ్ ఇప్పటికే చివరిదశకు వచ్చేసింది.. కానీ పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆలస్యం కారణంగానే సినిమా సెప్టెంబర్ 25 నుంచి వాయిదా పడింది.

కొత్త డేట్ ఎప్పుడా అని వేచిచూస్తున్న అభిమానులకు తీపికబురు చెప్పారు బాలయ్య. డిసెంబర్ మొదటి వారంలో సినిమా వస్తుందన్నారీయన. అంతేకాదు.. ఈసారి అఖండ 2 దెబ్బకు థియేటర్లలో పూనకాలు ఖాయమంటున్నారు

అఖండ 2లో ప్రధానంగా సనాతన ధర్మం గురించి చెప్పబోతున్నట్లు తెలిపారు బాలయ్య. అందుకే కేవలం తెలుగులో మాత్రమే కాదు.. ఈసారి నార్త్‌పై కూడా బాగానే కాన్సట్రేట్ చేస్తున్నారు మేకర్స్. బాలయ్యే హిందీలో సొంత డబ్బింగ్ చెప్పారు. అఖండలో అక్కడక్కడే సనాతన ధర్మం టాపిక్ ఉంటుంది.. కానీ పార్ట్ 2లో మొత్తం అదే ఉండబోతుంది.