
తెలుగు ఇండస్ట్రీలో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మొదలైందా..? ఈ ప్రశ్నకు సమాధానం అవును అనే చెప్పాలేమో..? ఇప్పటి వరకు అప్పుడప్పుడూ మాత్రమే అనిరుధ్ పేరు స్క్రీన్ మీద కనిపించేది. కానీ ఇకపై తరుచూ తన పేరే వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు రాక్ స్టార్. తమిళంతో పాటు తెలుగుపై కూడా ఫుల్ ఫోకస్ చేసారు. తాజాగా మరో భారీ ప్రాజెక్ట్ సైన్ చేసారు అనిరుధ్.

దేవర తర్వాత టాలీవుడ్‌లో అనిరుధ్ పేరు మార్మోగిపోతుంది. ఈ సినిమా విజయంలో అని పాత్ర కీలకం. ముఖ్యంగా మనోడు అందించిన రీ రికార్డింగ్‌కు థియేటర్స్‌లో ఆడియన్స్ ఊగిపోతున్నారు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌తో పాటు కొన్ని సీన్స్‌కు అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ పూనకాలు పుట్టించింది. ఇక తమిళంలో ఈయన సంచలనాలకు హద్దే లేదు.

తమిళ్‌లో వరస సినిమాలు చేసిన అనిరుధ్.. తెలుగులో మాత్రం అప్పుడప్పుడూ మాత్రమే తన మ్యూజిక్ వినిపిస్తూ వచ్చారు. కానీ దేవర తర్వాత మనసు మార్చుకున్నట్లున్నారీయన. అందుకే వరస ప్రాజెక్ట్స్ ఓకే చెస్తున్నారు. దేవర 2 ఎలాగూ లైన్‌లో ఉంది.. దాంతో పాటు విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు ఈయనే సంగీతం అందిస్తున్నారు.

విజయ్ దేవరకొండ సినిమాతో పాటు గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న చిన్న సినిమా మ్యాజిక్‌కు కూడా అనిరుద్ధే సంగీత దర్శకుడు. తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పారీయన. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో రాబోతున్న రెండో సినిమాకు అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. గతంలోనే నానితో జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు పని చేసారీయన.

తమిళంలో అందరు హీరోలతో పని చేస్తున్న అనిరుధ్.. తెలుగులో మాత్రం చాలా పర్టిక్యులర్‌గా ముందుకెళ్తున్నారు. నానితోనే ఎక్కువ పని చేస్తున్నారు అని. మరోవైపు తను కనెక్ట్ అయిన దర్శకులకే పని చేస్తున్నారు. ఈయన దూకుడు చూస్తుంటే త్వరలోనే తమన్, దేవీకి తెలుగులో అనిరుధ్ గట్టి పోటీ ఇచ్చేలాగే కనిపిస్తున్నారు.