
మా వల్ల కాదు బాబోయ్.. మా వల్ల కాదు.. ఇలా ఉన్నారేంటయ్యా మీరు.. కెమెరాలెక్కడ పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదు.. ఇదిగో దర్శక నిర్మాతలు ఇదే అంటున్నారు లీకు వీరులను చూసి. ఎక్కడ్నుంచి లీక్ చేస్తున్నారో తెలియదు కానీ పెద్ద సినిమాలకు పెద్ద గండే కొడుతున్నారు వీళ్లు. తాజాగా మరోసారి పుష్ప 2 ఫోటో లీకైంది. ఇదిప్పుడు వైరల్ అవుతుంది. మరి దీనిపై టీం రియాక్షన్ ఎలా ఉండబోతుంది..?

ఈ రోజుల్లో పెద్ద సినిమాలు చేయడం కాదు.. చేసిన సినిమాలను విడుదలయ్యే వరకు కాపాడుకోవడమే పెద్ద టాస్క్ అయిపోయింది. షూటింగ్ మొదలైన రోజు నుంచే లీకుల బెడద కూడా మొదలవుతుంది. తాజాగా పుష్ప 2కు లీక్ షాక్ తగిలింది. పైగా ఇది మొదటిసారి కాదు.. ఆ మధ్య వైజాగ్‌లో షూట్ జరుగుతున్నపుడు.. ఆ తర్వాత మారేడుమిల్లి షూట్ వీడియోలు లీకయ్యాయి. మరోసారి ఇదే జరిగింది.

ఈ మధ్య బ్రేక్స్ లేకుండా పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. అల్లు అర్జున్ ఉన్నా లేకపోయినా.. సుకుమార్ షూట్ మాత్రం ఆపట్లేదు. ప్రస్తుతం RFCలోనే పుష్ప 2 షూట్ జరుగుతుంది. అంతా బాగానే ఉంది కానీ.. షూటింగ్ స్పాట్ నుంచి అల్లు అర్జున్ చీరలో ఉన్న ఫోటో లీక్ అయింది. లీక్ అయిన నెక్ట్స్ సెకండ్ నుంచి ఇంటర్నెట్‌ను ఊపేస్తుంది ఈ ఫోటో.

పుష్ప 2 ఇంటర్వెల్ సీన్‌లో భాగంగా గంగమ్మ జాతర సీన్ షూట్ చేస్తున్నారు సుకుమార్. ఈ సీక్వెన్స్‌లో అల్లు అర్జున్ చీరలో ఉంటారని తెలుస్తుంది. అదే ఇదా అనే సందేహాలు ఇప్పుడొస్తున్నాయి. ఇదిలా ఉంటే గతంలోనూ నిమిషానికి పైగానే నిడివి ఉన్న గంధపుచెక్కల స్మగ్లింగ్ సీన్ లీక్ అయింది. ఈ విషయంలో పుష్ప 2 మేకర్స్ సీరియస్‌గా ఉన్నారు. లీక్ చేసిందెవరైనా లీగల్‌గా వెళ్లాలని చూస్తున్నారు వాళ్లు.

పుష్ప పార్ట్ 1కు కూడా లీక్స్ తప్పలేదు. అప్పట్లో దాక్కో దాక్కో మేక పాటను కొందరు మొబైల్‌లో తీసి లీక్ చేసిన వీడియో వైరల్ అయింది. ఇక పుష్ప 2కి కూడా మొదట్నుంచి లీక్ బెడద తప్పట్లేదు. ఈ లీక్స్‌తో హైప్ పెరిగినా.. ముప్పు కూడా అదే స్థాయిలో ఉంటుంది. అందుకే మేకర్స్ అలర్ట్ అవుతున్నారు. ఆగస్ట్ 15న పుష్ప 2 సినిమా విడుదల కానుంది.