
కెరీర్ మొదట్నుంచి కూడా నేను హీరో.. హీరోగా మాత్రమే నటిస్తా.. లీడ్ రోల్స్ మాత్రమే చేస్తాననే కండీషన్స్ ఏం పెట్టుకోలేదు అల్లరి నరేష్. సింపుల్‌గా తనకు వచ్చిన పాత్రలకు న్యాయం చేస్తూ వెళ్లిపోయారు.

మధ్యలో కొన్ని సినిమాలు హిట్టయ్యాయి. కామెడీ హీరోగా అలా సెటిల్ అయిపోయారంతే. అప్పుడప్పుడూ గమ్యం, విశాఖ ఎక్స్‌ప్రెస్, ప్రాణం లాంటి సినిమాలు నరేష్‌లోని నటున్ని చూపించాయి.

హీరోగా నటిస్తున్నపుడే గమ్యం, శంభో శివ శంభో సహా చాలా సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసారు నరేష్. ఇక మహేష్ బాబు మహర్షి తర్వాత అల్లరి నరేష్ కెరీర్ మరో మలుపు తీసుకుంది.

ఇందులో అతి కీలకమైన పాత్రలో నటించిన ఈయన.. తర్వాత నాందీతో హీరోగానూ సీరియస్ టర్న్ తీసుకున్నారు. ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం, ఉగ్రం సినిమాలతో అదే దారిలో వెళ్తున్నారిప్పుడు.

సీరియస్ రోల్స్ చేస్తూనే.. ఈ మధ్యే సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు దర్శకత్వంలో బచ్చల మల్లి అనే ఎంటర్‌టైనింగ్ కథకు ఓకే చెప్పారు. తాజాగా నాగార్జున నా సామిరంగాలోనూ అంజిగాడు అనే సరదా పాత్ర చేస్తున్నారు. ఓ వైపు హీరోగా బిజీగా ఉంటూనే.. మరోవైపు సపోర్టింగ్ రోల్స్‌కు తన సపోర్ట్ అందిస్తున్నారు అల్లరోడు. రిస్క్ అని తెలిసినా.. రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.