
హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల వివాహం హీరో అక్కినేని నాగచైతన్యతో జరగనున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరగనుంది.

ఇప్పటికే ఇరు కుటుంబాల్లో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. కాబోయే వధూవరులకు ఇటీవల మంగళ స్నానాలు చేయించారు. ఇక సోమవారం శోభితను పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి మంగళ హారతులు ఇచ్చారు.

ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. అందులో ఆమె సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతూ మరింత అందంగా కనిపించారు. వీరిద్దరికి రెండేళ్ల క్రితమే పరిచయం ఏర్పడింది.

శోభిత మంచి మనసు తనను కట్టిపడేసిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు నాగచైతన్య. ముంబైలో జరిగిన ఓ ఓటీటీ ఈవెంట్లో ఇద్దరం తొలిసారి కలుసుకున్నామని.. ఆమె మాటల్లోనే మంచి మనసు తనను కట్టిపడేసిందని అన్నారు.

ఒకరినొకరం బాగా అర్థం చేసుకున్నామని.. ఫ్యామిలీకి తాను ఎంతో ప్రాధాన్యమిస్తుంటుందని.. అందుకే ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఎదురుచూస్తున్నానని అన్నారు.