
నాన్ వెజ్ పచ్చళ్ళలో రారాజు చికెన్ పచ్చడి.. చాలా మంది ఇష్టంగా తినేది చికెన్. చికెన్ పచ్చడి ఇంట్లో ఉంటే చాలు నాన్ వెజ్ ప్రియులకు పండగే. ఎప్పడు కావాలంటే అప్పుడు చికెన్ తినేయొచ్చు. ఉభయగోదావరి జిల్లాల్లో చికెన్ పచ్చడి చాలా ఫేమస్.. చికెన్, రొయ్యలు, మటన్, పీతలు, కొరమీను, పండుగప్ప ఇలా ఏ నాన్ వెజ్ పచ్చడి అయినా సరే గోదావరి జిల్లాలు పెట్టింది పేరు.. నాన్ వెజ్ పచ్చల్లో ఎవర్ గ్రీన్ అంటే చికెన్ పచ్చడే.

పక్కా కొలతలతో చికెన్ పచ్చడి చేసుకుంటే రెండు నెలలు పైనే నిల్వ ఉంటుంది. చికెన్ పచ్చడి చేయాలంటే ప్రత్యేక పద్ధతి ఉందంటున్నారు భీమవరం కు చెందిన సాయి తేజ నాన్ వెజ్ పికిల్స్ నిర్వాహకులు శివప్రసాదరాజు. చికెన్ పచ్చడి తయారీ విధానాన్ని వివరించారు.

ముందుగా ఫ్రెష్ చెకెన్ తీసుకుని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. బోన్ లేకుండా చికెన్ తీసుకోవాలి. కొద్దిగా పసుపు కలిపి చికెన్ ను బాగా ఉడికించి చల్లారనివ్వాలి. ఆ తరువాత మంచి నూనెలో చికెన్ ను ప్రై చేసుకోవాలి. ముక్క బాగా వేగి, గట్టిపడిన తరువాత పక్కకు తీసుకోవాలి.

నాణ్యమైన మసాలా దినుసులతో గ్రేవీ తయారు చెయ్యాలి. దాల్చిన చెక్క, జీలకర్ర, యాత్రికులు, ధనియాలు, లవంగాలు, ఉప్పు, కారం, వెల్లుల్లి తో గ్రేవీ తయారుచేసుకొని వేరుశనగ నూనెతో బాగా కలుపుకోవాలి.

ఫ్రై చేసిన చికెన్ ముక్కల్లో తగినంత గ్రేవీ వేసుకొని బాగా కలుపుకోవాలి. తగినంతగా వేరుశనగ నూనెను పోసుకోవాలి. తగినంతగా నిమ్మరసం పిండాలి. అంతే సింపుల్ గా నోరూరించే చికెన్ పచ్చడి రెడీ అవుతుంది.

ఉదయం టిఫిన్, భోజనం సమయంలో ఈ పచ్చడిని ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పచ్చడి రెండు నెలలు పైనే నిల్వ ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన చికెన్ పచ్చడి విదేశాలకు పంపుతామని శివప్రసాదరాజు అంటున్నారు.