
హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఫేమస్.. మరి చార్మినార్ ప్రాంతానికి..? రంగురంగుల్లో మెరిసే గాజులు ఫేమస్. అవును, ఇది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిన మాట. ముఖ్యంగా మహిళలు చార్మినార్ సందర్శనకు వచ్చారంటే.. ఇక్కడ దొరికే గాజులను కొనకుండా వెళ్లరు. కొందరైతే గాజులను కొనడానికే చార్మినార్ ప్రాంతానికి వస్తారంటే అందులో అతిశయోక్తి లేదు. అంతగా ప్రసిద్ధి చెందింది గాజుల కొనుగోళ్లకు చార్మినార్ ప్రాంతం. అయితే.. ఈ మధ్య చార్మినార్ సందుల్లో సరికొత్త మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు రంగురంగుల్లో మెరిసే గాజులు, ముత్యాలు, ఖాడా దుపట్టాలకు మాత్రమే ప్రసిద్ధి చెందిన లాడ్ బజార్.. ఇప్పుడు మరో కొత్త అంశంతో జనాలను ఆకర్షిస్తోంది. అదేంటంటే.. ప్రత్యక్షంగా గాజులు తయారుచేసే కేంద్రాలు.

లాడ్ బజార్ మార్కెట్‌లోకి ప్రవేశించగానే గాజుల దుకాణాల బయట గుంపులుగుంపులుగా జనం కనిపిస్తున్నారు ఈ మధ్య. ఎందుకు అంత మంది ఒక దగ్గర మూగి ఉన్నారని పరిశీలిస్తే.. అక్కడ మీకు కూడా కళ్లు చెదిరిపోయే దృశ్యాలు కనిపిస్తాయి. దేనికంటారా?.. లక్కను కరిగించి వాటిని రంగురంగుల గాజులుగా మలుస్తున్న నిపుణులు, కళాకారులు మీకు అక్కడ కనిపిస్తారు. వారంతా ఎంతో నైపుణ్యంగా మీ కళ్ల ముందే గాజులను ప్రత్యక్షంగా తయారుచేసి చూపిస్తున్నారు. ఇంకేముంది.. అంతటి నైపుణ్యాన్ని, వారి చేతుల్లో రూపుదిద్దుకుంటున్న అద్భుతాన్ని చూస్తూ జనాలు ఊరికే ఉంటారా?.. వెంటనే జేబుల్లోని మొబైల్ ఫోన్లను తీసి, వారి తయారుచేస్తున్న తీరును మొత్తం కెమెరాల్లో బంధిస్తున్నారు.

అలా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల్లో ఇందుకు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నారు. ఆ వీడియోల్లో కళాకారులు మనం చూస్తుండగానే వారి చేతుల్లో అద్భుతమైన రంగుల గాజులను తయారుచేయడం పలువురిని ఆకర్షిస్తోంది. ఈ కొత్తగా పుట్టుకొచ్చిన ఆసక్తికి చాలా వరకు సోషల్ మీడియానే కారణం. కొన్ని నెలలుగా లాడ్ బజార్ కళాకారులు మండుతున్న జ్వాలలపై చెక్క కడ్డీలను తిప్పుతూ, తళతళలాడే గాజులను తయారుచేస్తూ పని చేయడాన్ని చూపిస్తున్న రీల్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ నిండిపోయింది. తద్వారా ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఎంతో మంది కళాకారులు ఈ వీడియోల ద్వారా బయట ప్రపంచానికి పరిచయం అవుతున్నారు.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారు.

అయితే.. చాలా అరుదుగా లభించే లక్క గాజులు తయారీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. లక్క గాజులు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు.. తరతరాలుగా హైదరాబాద్ సాంస్కృతిక జీవనంలో ఓ భాగం. భారతీయ సాంప్రదాయానికి ఓ గుర్తింపు.. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఈ రకం గాజులను మళ్లీ ఆదరించడం, కొనుగోలు చేయడంతో ఈ కొత్త పోకడ తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది. లక్క అనేది రేగు, కుసుమ్ వంటి చెట్ల నుంచి లభించే ఓ సహజమైన జిగురు పదార్థం. ఇది చాలా గట్టిగా ఉంటుంది.. అయితే వేడి మీద పెట్టినప్పుడు మాత్రం మెత్తబడుతుంది. ఇలా మెత్తబడిన పదార్థాన్ని కళాకారులు వివిధ రకాల గాజులుగా మలుస్తున్నారని 60 ఏళ్ల పురాతన 'జుబేర్ బ్యాంగిల్స్' దుకాణం యజమాని మహమ్మద్ అహ్మద్ చెబుతున్నారు. రోజుకు సుమారు 150 నుంచి 200 గాజులను విక్రయిస్తున్నామని, ధరలు రూ. 50 నుంచి ప్రారంభమవుతాయని అహ్మద్ తెలిపారు

ఒకప్పుడు ఎక్కడో సందుల్లో ఉండే పరిశ్రమల్లో ఎవరికీ తెలియకుండా రూపుదిద్దుకునే ఈ రకం కళ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఓ ట్రెండ్‌గా మారింది. కొన్ని నెలలుగా లక్క గాజుల తయారీని ప్రత్యక్షంగా తీసిన వీడియోలు, రీల్స్ చూసి వేలాది మందిని లాడ్ బజార్ వైపు నడిపిస్తున్నారు. తద్వారా వ్యాపారమూ పెరిగింది. సిరాజ్ బ్యాంగిల్స్ దుకాణం యజమాని కమలుద్దీన్ ఈ కొత్త రకం గాజుల తయారీ గురించి వివరిస్తూ.. ప్రస్తుతం పెద్దమొత్తంలో జరుగుతున్న వ్యాపారం 80 నుంచి 90 శాతం ఇన్‌స్టాగ్రామ్ వల్లే జరిగిందని అంటున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వ్యాపారానికి సోషల్ మీడియా అనేది ఎలాంటి ప్రధాన పాత్ర పోషిస్తోందని. గత రెండు, మూడు నెలల్లో ఈ తరహా లక్క గాజులకు డిమాండ్ బాగా పెరిగిందని.. రానున్న పండుగ దినాల్లో ఇది మరింత పెరిగే అవకాశముందని ఆయన అంటున్నారు. ఇటీవల ఈ గాజుల తయారీ ప్రక్రియకు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్ చేయగా, దానికి 26 లక్షల వ్యూస్ వచ్చాయని.. దాని వల్ల అమెరికా నుంచి కూడా కస్టమర్లు వచ్చి గాజులు కొనుగోలు చేశారని చెబుతున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. చార్మినార్ సందుల్లో భారీ స్థాయిలో జరుగుతున్న ఈ వ్యాపారానికి సోషల్ మీడియా ఎంత లాభం తెచ్చి పెట్టిందో..!