- Telugu News Photo Gallery Chanakya Niti: Do you know how to identify true friends and hidden enemies
Chanakya Niti: స్నేహితులే కొంప ముంచుతారు జాగ్రత్త.. శత్రువుని గుర్తించే సీక్రెట్ చెప్పిన చాణక్య..
మన వెనకే ఉంటూ వెన్నుపోటు పొడిచేవారు చాలా మంది ఉంటారు. అందుకే ఎవరినీ అంత ఈజీగా నమ్మకూడదు. మన స్నేహితుల్లో శత్రువులు ఎవరో తెలుసుకోవాలి. లేకపోతే అటువంటి వారి వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దీన్ని గురించి చాణక్య కొన్ని సీక్రెట్ చెప్పారు.
Updated on: Sep 06, 2025 | 5:41 PM

జీవితంలో మనకు స్నేహితులు, శత్రువులు ఇద్దరూ ఉంటారు. కానీ వారిలో నిజమైన వారు ఎవరో, కపట బుద్ధి కలిగినవారు ఎవరో గుర్తించడం చాలా కష్టం. ఈ విషయంలో శతాబ్దాల క్రితం ఆచార్య చాణక్యుడు తన విధానాల్లో వివరించిన సూత్రాలు నేటికీ ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. మనిషి స్వభావం, ప్రవర్తనను బట్టి ఒక వ్యక్తి నిజమైన స్నేహితుడో లేదా కపట శత్రువో ఎలా గుర్తించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

కొంతమంది మన ముందు స్నేహంగా ఉన్నట్లు నటిస్తారు, కానీ వారి మనసులో మాత్రం అసూయ, ద్వేషం, శత్రుత్వం నిండి ఉంటాయి. ఇలాంటివారు మన విజయాన్ని అస్సలు ఓర్వలేరు. మనకు ఏ చిన్న కష్టం వచ్చినా సంతోషిస్తారు. అవకాశం వచ్చినప్పుడు ఎలాంటి మొహమాటం లేకుండా మనల్ని మోసం చేయడానికి వెనుకాడరు. చాణక్యుడి ప్రకారం.. ఇలాంటి కపట వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

ఒక వ్యక్తి నిజమైన స్వభావం అతని ప్రవర్తన, మాటతీరులోనే వ్యక్తమవుతుంది. మన ముందు మనల్ని పొగిడే వ్యక్తి, మన వెనుక మనల్ని విమర్శించే వ్యక్తిని ఎప్పటికీ విశ్వసించలేము. అలాంటివారు మన బలాన్ని తెలుసుకోవడానికి దగ్గరవుతారు. ఆ తర్వాత మన బలహీనతలను తెలుసుకొని మనకు నష్టం కలిగిస్తారు.

కష్ట సమయాల్లోనే మనకు నిజమైన స్నేహితుడు, శత్రువుల మధ్య ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తుంది. కష్టాల్లో స్వార్థం లేకుండా మనకు సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. కేవలం తన ప్రయోజనం కోసం మనతో ఉంటూ, కష్టం వచ్చినప్పుడు మనల్ని పట్టించుకోనివాడు నిజమైన శత్రువు.

ఈ ప్రపంచంలో మన సంతోషంలో పాలుపంచుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు. కానీ మన దుఃఖంలో, కష్టంలో మనతో భుజం భుజం కలిపి నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. చాణక్యుడి ప్రకారం.. మనం కేవలం కష్ట సమయాల్లోనే కాదు, జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంలో కూడా సహాయపడే వ్యక్తిని స్నేహితుడిగా ఎంచుకోవాలి. అలాంటి స్నేహం మనల్ని బలోపేతం చేస్తుంది, మన అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. అందుకే అలాంటి స్నేహాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి.




