
భారత ఆర్థిక శాస్త్ర, నీతి శాస్త్ర పితామహుడిగా పేరొందిన ఆచార్య చాణక్యుడు అనేక మానవ సమస్యలకు సులభమైన మార్గాలను చూపారు. ఆర్థిక సమస్యలతోపాటు బంధాలు, జీవితంలో విజయం సాధించడం, ఎవరితో ఎలా ఉండాలి, వ్యక్తికి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఆయన స్పష్టంగా తెలియజేశారు. మంచి, చెడు మధ్య తేడాలను తెలియజేశారు. జీవితంలో ఎలాంటి వారికి దూరంగా ఉండాలి. ఎవరితో స్నేహం చేయాలి. జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏం చేయాలనేదానిపై సూచనలు చేశారు. చాణక్య నీతి అంటే జీవితం, రాజకీయం, ధనం, మిత్రత్వం, శత్రుత్వం వంటి అంశాలపై చాణక్యుడు చెప్పిన ఆచరణాత్మక సూత్రాల సంగ్రహం. కొన్ని ప్రసిద్ధ చాణక్య నీతులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కాలం, శత్రువు ఎవరి కోసం వేచిచూడదు.. కాలం అది నిరంతరంగా కొనసాగే ప్రక్రియ. ప్రపంచంలో ఏది ఆగినా కాలం మాత్రం ఆగదు. అందుకే నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యం చేయకూడదంటారు. పనులు కూడా వెంటనే చేయాలంటారు. వచ్చిన అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోవాలని చెబుతారు. ఇక శత్రువు కూడా అంతే అవకాశం వచ్చిన దాడి చేస్తాడు. అతని ముందు అదొక్కటే లక్ష్యం ఉంటుంది.

అతిగా నిజాయితీగా ఉండేవాడు మూర్ఖుడిగా భావించబడతాడు.. జీవితంలో నిజాయితీ అవసరమని చాణక్యుడు స్పష్టం చేశాడు. అయితే, అది అన్ని సందర్భాల్లో సరికాదని అంటారు. మంచి వారి దగ్గర నిజాయితీగా ఉండవచ్చు. కానీ, చెడు వ్యక్తుల దగ్గర నిజాయితీగా ఉండాల్సిన అవసరం లేదని చెబుతారు. అందుకే పరిస్థితికి తగినట్లుగా జ్ఞానంతో వ్యవహరించడం అవసరమని చెబుతారు.

విద్య లేని ధనం అహంకారానికి దారి తీస్తుంది.. విద్యతోపాటు వచ్చే ధనం వినయాన్ని తీసుకొస్తుందని చాణక్యుడు చెబుతారు. అయితే, విద్య లేకుండా వచ్చిన ధనం వ్యక్తిలో అహంకారం తీసుకొస్తుందని అంటారు. జ్ఞానంతోపాటు వినయం కూడా అత్యంత ముఖ్యమైన విషయం అని ఆయన అంటారు.

శత్రువుని చిన్నవాడిగా తక్కువ అంచనా వేయకూడదు.. మనం ఎప్పుడూ శత్రువును తక్కువ అంచనా వేయకూడదని చాణక్యుడు చెబుతారు. ఎందుకంటే.. అతని లక్ష్యం మనకు హాని చేయడమే. అందుకే మనం అతడ్ని తక్కువ అంచనా వేయకుండా ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు. అవసరమైతే అతడ్ని మిత్రుడిగా మార్చుకోవాలి లేదంటే అతడ్ని మనవైపు రాకుండా చేసుకోవాలని సూచిస్తున్నారు. శత్రువు పట్ల జాగ్రత్తగా ఉండటమే మనకు సురక్షితమని చెబుతున్నారు.

మంచి మిత్రుడు కష్టకాలంలోనే తెలుస్తాడు.. మన వద్ద అన్నీ ఉన్నప్పుడు చాలా మంది బంధువులుగా దగ్గరికి వస్తారు. కానీ, మనం కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరైతే మనకు తోడుగా ఉంటారో వారే మన నిజమైన స్నేహితులు అని చాణక్యుడు చెబుతున్నారు. అందుకే నిజమైన బంధాలు పరీక్షా కాలంలోనే బయటపడతాయని వివరిస్తున్నారు.

ఆలస్యం విజయానికి అడ్డంకి.. జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరమని చాణక్యుడు చెబుతారు. ఎందుకంటే క్రమశిక్షణతో చేసే పని మనకు విజయాన్ని తీసుకొస్తుందని అంటారు. ఇవాళ చేసే పనిని రేపు చేస్తామంటూ వాయిదా వేస్తే ఆ పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని, దీంతో ఇతర పనులు కూడా దెబ్బతింటాయని చెబుతారు. ప్రతి పనిలో ఆలస్యం విజయాన్ని దూరం చేస్తుందని హెచ్చరిస్తున్నారు. అందుకే మనం చేసే పనిలో ఆలస్యం లేకుండా చూసుకోవాలని.. అది విజయాన్ని మరింత తొందరగా ఇస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.