
ఆరోగ్యానికి ఆల్కహాల్ అస్సలు సురక్షితం కాదు. WHO, లాన్సెట్ విడుదల చేసిన 2023 నివేదిక ప్రకారం.. కాలేయం, సిర్రోసిస్, గుండె జబ్బులతో సహా ఇతర నాన్-కమ్యూనికేబుల్ వ్యాధుల వంటి వివిధ రుగ్మతలన్నింటికీ ఆల్కహాల్ ప్రధాన కారణం. ఇది ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

చలి వాతావరణం అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి అదనపు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కానీ కొందరు ఈ కాలంలో జలుబు, దగ్గు వంటి వాటి నుంచి రక్షించుకోవడానికి ఆల్కహాల్ తీసుకోవడం మొదలుపెడతారు. ఇది ఎంత ప్రమాదకరమో తెలిస్తే జన్మలో ముట్టుకోరని అంటున్నారు వైద్యులు.

నిజానికి, ఈ కాలంలో మద్యం తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చనే అపోహ చాలా మందిలో ఉంటుంది. కానీ శీతాకాలంలో మద్యం సేవించడం వల్ల వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీకావు. సాధారణంగా సాయంత్రం వేళల్లో చలి మొదలవుతుంది. చలి నుంచి ఉపశమనం పొందడానికి చాలా మందికి మద్యం సేవించే అలవాటు ఉంటుంది. అందులోనూ చలి నుంచి తప్పించుకోవడానికి మరికాస్త ఎక్కువగా తాగుతారు.

ఈ అలవాటు అనేక సమస్యలను ఆహ్వానిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది శ్వాసకోశ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. తీవ్రమైన జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం నీలంగా మారడం, పెదవుల నుండి రక్తం, కఫం సమస్యలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్ సూచిస్తున్నారు.

ఆల్కహాల్ తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడి కాలేయం ఎక్కువగా పని చేయాల్సి వస్తుంది. దీని కారణంగా, శరీరం సహజ గ్లో కోల్పోవడం ప్రారంభమవుతుంది. ఆల్కహాల్ వేడి చేస్తుంది. ఇది కణాలు త్వరగా చనిపోయేలా చేస్తుంది. ఆల్కహాల్ కారణంగా.. చర్మం పాడై ముడతలు వస్తాయి. కళ్లు ఎర్రబారతాయి, ఉబ్బుతాయి. కణాలకు అవసరమయ్యే కొల్లాజెన్‌ని కోల్పోతారు. అందుకే మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు.