మునుగోడులో నేతల మోహరింపు వేగవంతమైంది. గల్లీకో రాష్ట్ర నాయకుని చొప్పున మోహరించడంలో అధికార టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ముందుందనే చెప్పాలి. మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులను ఒడ్డెందుకు రెడీ అయిపోయాయి. తన సిట్టింగు సీటు కోసం బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తమ సిట్టింగు సీటు కోసం సకల అస్త్రాలతో రంగంలోకి దిగుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. తమది కాకపోయినా.. ఎనిమిదిన్నరేళ్ళ పరిపాలనకు గీటురాయిగా మునుగోడు ఉప ఎన్నిక విజయాన్ని చాటుకునేందుకు గులాబీ పార్టీ గిరిగీసి మరీ పోరుకు సిద్దమైంది. గులాబీ బాస్ కేసీఆర్ కూడా స్వయంగా ఓ గ్రామానికి ఇంఛార్జిగా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది. కీలక నేతలు కేటీఆర్, హరీశ్ రావు కూడా ఒక్కో గ్రామానికి ఇంఛార్జిలుగా నియమితులయ్యారు. గ్రామాలైతే రెండే వార్డులకు ఓ ఎమ్మెల్యేను, మునిసిపాలిటీలైతే ఒక్కో వార్డుకు ఓ ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీని కేసీఆర్ ఇంఛార్జిలుగా నియమించారు. ఇక మంత్రుల సంగతి వేరే చెప్పనక్కర లేదు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం ఆరు మండలాలు, రెండు మునిసిపాలిటీలుండగా రాష్ట్ర స్థాయి నేతల మోహరింపుతో నియోజకవర్గం మొత్తం పార్టీల పతాకాలతో రంగురంగుల ప్రపంచాన్ని తలపిస్తోంది. ఉప ఎన్నిక రావడానికి కారకులైన రాజగోపాల్ రెడ్డి.. గల్లీ గల్లీని జల్లెడపడుతున్నారు. తనకు గతంలో మద్దతిచ్చిన వారందరినీ కలిసి పార్టీలకతీతంగా తన వెంట నడవాలని అభ్యర్థిస్తున్నారు. అదేసమయంలో అధికార గులాబీ పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ వస్తున్నారు. ఇంకోవైపు దశాబ్ధాలుగా మునుగోడు నుంచి ప్రాతినిధ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాల్వాయి స్రవంతికి టిక్కెటిచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా యధాశక్తి ప్రయత్నాలు మొదలుపెట్టింది. తాను టీపీసీసీ అధ్యక్షుడయ్యాక జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీని గెలిపించలేకోయిన రేవంత్ రెడ్డి ఈసారి ఎలాగైనా పరువు దక్కించుకునేందుకు యత్నాలు మొదలుపెట్టారు.
అక్టోబర్ 3వ తేదీన మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూలు వెలువడింది. ఏడో తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యింది. అదేరోజు నామినేషన్ల పర్వం మొదలైంది. 14వ తేదీ దాకా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా.. అధికార గులాబీ పార్టీ పూర్తి స్థాయి బలగాలను మునుగోడుకు తరలించింది. పార్టీ పేరు మార్చినా అదింకా కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి పొందకపోవడంతో మునుగోడులో టీఆర్ఎస్ బీఫాం పైనే పార్టీ అభ్యర్థి పోటీ చేయనున్నారు. నామినేషన్ల పర్వం మొదలైన రోజునే కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్ కీలక నేతలకు బాధ్యతలప్పగించారు. వారందరినీ అక్టోబర్ 7వ తేదీనే నియోజకవర్గానికి తరలివెళ్ళాలని ఆదేశించారు. ప్రతీ ఎంపీటీసీ పరిధిని ఓ మంత్రికి గానీ, ఓ ఎమ్మెల్యేకుగానీ, ఓ ఎమ్మెల్సీకిగానీ అప్పగించారు. ఆ ఎంపీటీసీ పరిధిలో వుండే రెండు నుంచి మూడు వేల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే వారి బాధ్యత. ఒక ఎంపీటీసీ స్థానానికి ఇంఛార్జిగా వ్యవహరించే నేతకు ఏకంగా 30 మంది నాయకులకు అనుసంధానించారు. అంటే ఒక ఎంపీటీసీ స్థానం పరిధిలో 3వేల మంది ఓటర్లుంటే ప్రతీ వంద మంది ఓటర్లకు ఒకరు ఇంఛార్జిగా వుంటారన్నమాట. నియోజకవర్గంలోని రెండు మునిసిపాలిటీల్లో మరింత మందిని రంగంలోకి దింపారు. చండూరు మునిసిపాలిటీలో పది వార్డులకుగాను ఏకంగా అయిదుగురు ఎమ్మెల్యేలకు బాధ్యతలప్పగించినట్లు తెలుస్తోంది. ఇక చౌటుప్పల్ మునిసిపాలిటీ బాధ్యతలను పది మంది ఎమ్మెల్యేలకు అప్పగించారు. చండూరు మండలం గట్టుప్పల్ గ్రామానికి మంత్రి కే.టీ.రామారావు ఇంఛార్జిగా వ్యవహరించనున్నారు. మర్రిగూడ గ్రామానికి మరో మంత్రి హరీశ్ రావు బాధ్యునిగా వ్యవహరించనున్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా రెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డిలకు గ్రామాలు, వార్డులను కేటాయించారు. వీరందరు అక్టోబర్ 7వ తేదీ నుంచి నియోజకవర్గాన్ని వీడొద్దని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకేఒక సీటును గెలుచుకుని ఆ తర్వాత రెండు ఉప ఎన్నికల్లో సత్తా చాటి ఎమ్మెల్యేల నెంబర్‌ను మూడుకు పెంచుకున్న బీజేపీ ట్రిపుల్ ఆర్ (రాజాసింగ్, రఘునందన్, రాజేందర్)లకు తోడుగా మరో ఆర్ (రాజగోపాల్ రెడ్డి)ని అసెంబ్లీకి తెచ్చుకునేలా కమలనాథులు ప్రచార వ్యూహాలను రచిస్తున్నారు. ఉప ఎన్నిక పూర్తయ్యేదాకా నియోజకవర్గంలోనే మకాం వేస్తానని ప్రకటించిన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. కీలక నేతలకు బాధ్యతలప్పగించడంతోపాటు సంఘ్ పరివార్ సంస్థలన్నింటినీ ఓటర్ల చెంతకు పంపేందుకు రెడీ అవుతున్నారు. బండి సంజయ్‌తోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ ఓబీసీ సెల్ కన్వీనర్ డా. కే. లక్ష్మణ్, ఆపరేషన్ ఆకర్ష్ కన్వీనర్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులతోపాటు పలువురు రాష్ట్ర స్థాయి నేతలను మునుగోడు ప్రచారంలో వినియోగించుకునేలా ప్రణాళిక రచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్రను మునుగోడు ఉప ఎన్నికకు ఉపయోగపడేలా మలచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం పీక్ లెవెల్‌కు చేరుకునే సమయంలోనే రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో ప్రవేశిస్తుంది. అక్టోబర్ 24న నారాయణపేట జిల్లాలోకి రాహుల్ అడుగుపెడతారు. మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్‌నగర్ మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగనుండగా… శంషాబాద్ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేసి.. దానికి మునుగోడు ప్రచార సభగా మలచుకునేందుకు టీ.కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు. దీని కోసం భారత్ జోడో యత్ర ఇంఛార్జిగా వున్న దిగ్విజయ్ సింగ్‌ను ఒప్పించేపనిలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బిజీగా వున్నారు. శంషాబాద్ తర్వాత రాహుల్ గాంధీ… హైదరాబాద్ నగరం నడిమధ్య నుంచి తన పాదయాత్ర కొనసాగించబోతున్నారు. ఆరాంఘర్, చార్మినార్, అఫ్జల్‌గంజ్, గాంధీభవన్, నాంపల్లి, విజయ్‌నగర్ కాలనీ, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్ఈఎల్, పటాన్ చెరు మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగబోతున్నట్లు సమాచారం. రెండు, మూడు రోజుల పాటు ఆయన నగరంలో నడిచే అవకాశం వుంది. ఈ సందర్భాన్ని మునుగోడు ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యూహరచన చేస్తున్నారని సమాచారం. మూడు ప్రధాన అభ్యర్థుల పేర్లు ఖరారవడం, బరిలో ప్రజా యుద్ధనౌక గద్దర్ అలియాస్ విఠల్ రావు దిగుతుండడంతో మునుగోడు ప్రచారపర్వం క్రమంగా హీటెక్కుతోంది. మునుగోడు నియోజకవర్గంలో ట్రెడిషనల్ ఓటుబ్యాంకు కలిగి వున్న వామపక్షాలు టీఆర్ఎస్ (బీఆర్ఎస్)కు మద్దతు ప్రకటించడంతో గులాబీ శ్రేణుల్లో కదనోత్సాహానికి కారణమైంది.