తెలంగాణలో రాజకీయ ముఖచిత్రం మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణలో రాజకీయ సమీకరణల్లో మార్పు మొదలయ్యింది. అప్పటివరకు అధికార భారత రాష్ట్ర సమితి పార్టీని బలంగా ఢీకొనే పార్టీ బిజెపినా? లేక కాంగ్రెస్ పార్టీనా? అన్న చర్చలు కొనసాగాయి. కానీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడం ఒక్కసారిగా తెలంగాణలో పరిస్థితిని మార్చేసింది. కర్ణాటక ఫలితాలను అనుకూలంగా మలుచుకుని తెలంగాణలో వ్యూహానికి పదును పెట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాటల చాతుర్యం ఫలితాన్ని ఇస్తున్నట్లే కనిపిస్తుంది. ముఖ్యంగా భేషజాలను పక్కనపెట్టి అవసరమైతే తనను తిట్టమంటూ పార్టీని వీడిన వాళ్లంతా తిరిగి రావాలని రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పిలుపునిచ్చారు. దానికి తగినట్లే సామాజిక వర్గ సమీకరణలు ప్రభావితం చేసే రకంగా చర్యలు ప్రారంభించారు. ఇది ఫలితం ఇచ్చినట్టే కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి పార్టీలో ప్రాబల్యం గత నెల రోజుల్లో గణనీయంగా పెరిగింది. మరి ముఖ్యంగా పార్టీని విడిపోయిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలను ఘర్ వాపసీ ద్వారా వెనక్కి పిలవాలన్న రేవంత్ ప్రయత్నం పార్టీలోని ఆయన వ్యతిరేకులను సైతం ఆలోచింపజేసింది. చాలా కాలంగా రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తూ వస్తున్న నేతలు.. మారిన రేవంత్ మాటల సరళిని ప్రశంసించడం విశేషం. తాను ఒక మెట్టు తగ్గడం ద్వారా పార్టీని వీడిన వారిని వెనక్కి ఫలించే ప్రయత్నం చేయడం మంచిదని పార్టీలోని చాలామంది సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. కర్ణాటకలో మాదిరిగానే తెలంగాణలోనూ ప్రభుత్వ వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందని అదంతా కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గుతుందని చాలామంది కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే కర్ణాటక ఎన్నిక పలితాలు భారతీయ జనతా పార్టీ నేతల్లో నిరాశను నింపినట్లు ఆ పార్టీకి చెందిన నేతల మాటల్లోనే వ్యక్తం అవుతుంది. బిజెపి చేరికల కమిటీకి సారధ్యం వహిస్తున్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ దాదాపు చేతులెత్తేసినట్లే కనిపిస్తోంది. దాదాపు ఆరు నెలలుగా ప్రయత్నం చేస్తున్నా కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును తాను బిజెపిలోకి రప్పించలేకపోయానని ఈటల మీడియా ముందు వాపోవడం పరోక్షంగా ఓటమిని అంగీకరించినట్లే. మరో అడుగు ముందుకేసిన ఈటెల.. పొంగులేటి, జూపల్లి తననే పార్టీ మారే రకంగా ప్రోత్సహించారంటూ శల్య మాటలు వర్ణించారు. ఇంకోవైపు తెలంగాణ బిజెపి నేతల్లో మరో కీలక వ్యక్తి ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో బిజెపిది మూడో స్థానమేనని శల్య ప్రకటన చేశారు. వీరిద్దరి మాటలపై బిజెపి అధినాయకత్వం కానీ, బిజెపి రాష్ట్ర నాయకత్వం కానీ స్పందించినప్పటికీ.. వారి మాటలను కూడా ఎవరూ ఖండించకపోవడం గమనార్హం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీలో దూకుడు పెరగడం.. ఇంకొక వైపు బిజెపి నేతల మాటల్లో నిరాశ కనిపించడం తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారాయి అనడానికి రుజువుగా నిలుస్తున్నాయి.
నిజానికి బిజెపిలోకి పెద్ద ఎత్తున నేతల వలసలు కొనసాగుతాయని చాలామంది భావించారు. గత ఆరు నెలలుగా దీనికి సంబంధించి ఇప్పుడా అప్పుడా అన్నట్లుగా పరిస్థితి కనిపించింది. కానీ అలాంటి ఊహాగానాలు ఏమీ నిజం కాలేదు. ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు అంశం వెలుగు చూసిన తర్వాత బిజెపిలో చేరికలు తగ్గిపోయాయి. దానికి తోడు మునుగోడు ఓటమి కూడా ఒకింత కారణమైంది. తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిజెపిలో చేరికలకు పూర్తిగా బ్రేక్ వేసినట్లు కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ మీద ఉండదని కమలనాధులు చెబుతూ వచ్చారు. కానీ తాజా పరిణామాలు వారి మాటల్లో డొల్లతనాన్ని చాటుతున్నాయి. క్రమశిక్షణ కలిగిన భారతీయ జనతా పార్టీ నేతలు పార్టీ పరిస్థితి గురించి, చేరికల గురించి పేలవమైన ప్రకటనలు చేయడం రాష్ట్రంలో ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. తెలంగాణలో కేసీఆర్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని పలు వేదికలలో చాటిన కమలనాధులు కర్ణాటక ఫలితాలు తర్వాత తమ నోళ్లకు తాళం వేసుకున్నట్లు కనిపిస్తుంది. ఇక గత ఆరు నెలలుగా అటా ఇటా అన్నట్టు ఊరిస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రయాణం చివరకు గాంధీ భవన్ వైపేనని తాజా పరిణామాలు చాటుతున్నాయి. ఆయనతోపాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమని తెలుస్తోంది. జూన్ 8వ తేదీన పొంగులేటి, జూపల్లి గాంధీభవన్ మెట్లెక్కుతారని సమాచారం. అయితే తమ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని గాంధీభవన్‌కే పరిమితం చేయాలా లేక అత్యంత అట్టహాసంగా భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాలా అన్న విషయంలో ఇంకా సమాలోచనలు జరుగుతున్నట్లు గాంధీభవన్ వర్గాల బోగట్టా.
ఇదిలా ఉంటే సొంత అన్నతో విభేదించి.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను వదిలి తెలంగాణలో రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటూ తండ్రి పేరిట రాజకీయ పార్టీని ప్రారంభించిన వైయస్ షర్మిల కూడా కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌తో షర్మిలకున్న సాన్నిహిత్యం.. ఆమెను కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రోత్సహిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. దానికి తోడు 20 రోజుల వ్యవధిలో షర్మిల రెండు సార్లు శివకుమార్‌ని కలిసి వచ్చారు. తన తండ్రి, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి మిత్రుడైన శివకుమార్‌ని అభినందించేందుకు మాత్రమే కలిసానని షర్మిల చెబుతున్నప్పటికీ.. వీరిద్దరి భేటీ వెనక రాజకీయ వ్యూహం ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది. ఒకవైపు షర్మిల.. ఇంకోవైపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడితే ఖమ్మం జిల్లాలోని 10 స్థానాలకు పది స్థానాలను కైవసం చేసుకోవచ్చని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దానికి తోడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానులు ఉన్న ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలలో షర్మిల ప్రభావంతో కాంగ్రెస్ పార్టీకి మరింత మేలు కలుగుతుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే షర్మిల తమ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారా లేక ఎన్నికలకు ముందు పొత్తుకే పరిమితమై ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత విలీనానికి సిద్ధపడతారా అన్నది వేచి చూడాలి. అయితే ఒకవైపు డీకే శివకుమార్‌తో భేటీ అవుతూ వస్తున్న షర్మిల ఇంకోవైపు రేవంత్ రెడ్డిపై వాగ్బాణాలను సంధిస్తున్నారు. దానికి కారణం రేవంత్ రెడ్డి ఆమెని ఉద్దేశించి ఇటీవల చేసిన వ్యాఖ్యలే. ఆమెను ఆడబిడ్డగా గౌరవిస్తామని.. చీరే సారే పెడతామని చెబుతూనే.. షర్మిల రాజకీయాలు ఏపీలో చేసుకుంటే మంచిదని రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. ఆ కామెంట్లపై షర్మిల ఘాటుగానే స్పందించారు. ప్రస్తుతానికి వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నప్పటికీ రాజకీయాల్లో ఎప్పుడూ ఏమి జరుగుతుందో చెప్పలేము. పరస్పర ప్రయోజనం ఉంటుందనుకుంటే శత్రువులు.. మిత్రులుగా మారడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు.
ఒకవైపు బిజెపిలో చేరికలు నిలిచిపోవడం.. ఇంకోవైపు ఆ పార్టీ నేతలే శల్య ప్రకటనలు చేస్తూ వుండడం కమరనాథుల్లో కలవరం రేపుతోంది. ప్రజలకు ఆ పార్టీ వీక్ అయిందన్న సందేశం వెళ్తోంది. దీనిని చక్కదిద్దేందుకు తెలంగాణ బిజెపి నాయకత్వంకానీ, జాతీయ నాయకత్వంకానీ ఇంకా రంగంలోకి దిగకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు కర్ణాటక ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు దూకుడు పెంచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలకు ముందే.. ఇంకా చెప్పాలంటే ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగిసిన నాడే కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక వధేరా తెలంగాణ పర్యటనకు వచ్చారు. హైదరాబాద్ సిటీలో యువజన భేరీ నిర్వహించారు. ఆ తర్వాత కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం.. పలువురు నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం.. ఆ పార్టీ తెలంగాణ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది. దానికి కొనసాగింపుగా జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ వైపే పయనిస్తుండడం ఇంకాస్త ఉత్సాహాన్నిస్తోంది. ఇదే ఉత్సాహంలో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడి బిజెపి, బీఆర్ఎస్ పార్టీలలో చేరిన కాంగ్రెస్ మూలాలు ఉన్న వారిని తిరిగి రప్పించే ఘర్ వాపసీని వేగవంతం చేయాలని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ పరిణామాలను సునిచితంగా పరిశీలిస్తున్న కేసీఆర్.. రెండో స్థానం కోసం ఆ పార్టీలు రెండు పోటీ పడుతున్నాయని.. మొదటి స్థానం మాత్రం తమదేనని పార్టీ శ్రేణులకు సందేశమిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. ఈ నాలుగు నెలల సమయంలో మూడు ప్రధాన పార్టీలు అనుసరించే వ్యూహాలే చివరి అంకంలో ప్రధాన ఆస్త్రాలుగా మారబోతున్నాయి.