KOMATIREDDY VENKATREDDY: ఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు? హాట్ టాపిక్‌గా ఎంపీ వ్యవహార శైలి.. అప్పటి దాకా వ్యూహాత్మక మౌనమేనా?

Rajesh Sharma

Rajesh Sharma |

Updated on: Nov 09, 2022 | 1:33 PM

పార్టీకి ఎలాంటి నెగెటివ్ టచ్ రాకూడదన్న ఉద్దేశంతో ఆయన పేరును ఎవరు ప్రస్తావించినా టీ.కాంగ్రెస్ నేతలు అచీతూచీ స్పందిస్తూ వచ్చారు. ఇపుడు ఉప ఎన్నిక ముగిసిపోయింది. ఇటు రాహుల్ గాంధీ కూడా 12 రోజుల తెలంగాణ పాదయాత్ర ముగించుకుని మరాఠా రాష్ట్రంలోకి అడుగుపెట్టారు.

KOMATIREDDY VENKATREDDY: ఇంతకీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి దారెటు? హాట్ టాపిక్‌గా ఎంపీ వ్యవహార శైలి.. అప్పటి దాకా వ్యూహాత్మక మౌనమేనా?
Komatireddy Venkat Reddy

ఇంతకీ ఆయన దారెటు? తెలంగాణలో పొలిటికల్ హీట్ పెంచిన మునుగోడు ఉప ఎన్నిక పర్వం ముగిసిన తర్వాత ఇపుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఓవైపు మునుగోడు ఉప ఎన్నిక.. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తమ రాష్ట్రంలో కొనసాగుతుండడంతో మొన్నటి దాకా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆయనపై పెద్దగా ఫోకస్ చేయలేదు. ఆయన గురించి ఎవరు ఏమి అడిగినా అధిష్టానం చూసుకుంటుందంటూ దాటేస్తూ వచ్చారు. మునుగోడు బైపోల్ సందర్భంగా పార్టీకి ఎలాంటి నెగెటివ్ టచ్ రాకూడదన్న ఉద్దేశంతో ఆయన పేరును ఎవరు ప్రస్తావించినా టీ.కాంగ్రెస్ నేతలు అచీతూచీ స్పందిస్తూ వచ్చారు. ఇపుడు ఉప ఎన్నిక ముగిసిపోయింది. ఇటు రాహుల్ గాంధీ కూడా 12 రోజుల తెలంగాణ పాదయాత్ర ముగించుకుని మరాఠా రాష్ట్రంలోకి అడుగుపెట్టారు. సో.. ఇక ఆయన సంగతి తేల్చేందుకే టీ.కాంగ్రెస్ నేతలు రెడీ అవుతున్నారు.. ఇంతకీ ఆయన ఎవరు ? ఈపాటికే స్పురించి వుంటుంది కదా ఆయన పేరు?

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రెండు దశాబ్దాలుగా ఉమ్మడి నల్గొండ రాజకీయాల్లో పెద్ద పేరున్న నేత. ఇపుడు ఈయన వ్యవహారమే హాట్ టాపిక్ అయ్యింది. ఆయన సొంత తమ్ముడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెబుతూ ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. బీజేపీలో చేరి ఉపఎన్నికలో ఆ పార్టీ తరపున అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థితో హోరాహోరీ పోరాడారు. చివరికి పరాజయం పాలయ్యారు. అయితే తమ్ముడు పార్టీ మారినా తాను మాత్రం చివరి దాకా కాంగ్రెస్ పార్టీలోనే వుంటానన్న వెంకట రెడ్డి అసలు సమయానికి ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఇక్కడే వుంటే అటు తమ్ముడు.. ఇటు తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రెండింటి మధ్య ఇబ్బంది పడతాననుకున్నారో ఏమో విదేశాలకు వెళ్ళిపోయారు. పోలింగ్ తేదీకి రెండ్రోజుల ముందు ఇండియాకు తిరిగి వచ్చినా పార్టీ తరపున ప్రచారం చేయలేదు. ఈలోగా ఆయన ఆస్ట్రేలియా నుంచి మునుగోడు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులకు ఫోన్ చేసి.. ఈసారి సోదరుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతివ్వాల్సిందిగా కోరినట్లుగా ఓ ఆడియో క్లిప్ వైరలయ్యింది. ఓ ముస్లిం వర్గానికి చెందిన నేతకు ఫోన్ చేసినట్లు అందులో తెలుస్తోంది. ఈ ఆడియో క్లిప్ వైరల్ కావడంతో ఇటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు, అటు పార్టీ జాతీయ నాయకత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. షోకాజ్ నోటీసు జారీ చేస్తూ సమాధానమిచ్చేందుకు నిర్దిష్ట గడువు విధించింది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఇంతకీ వివరణ ఇచ్చారా లేదా?

అయితే ఆ గడువు ముగిసిన తర్వాత ఇండియాకు వచ్చిన వెంకటరెడ్డి.. తాను చెప్పుకోవాల్సింది అధిష్టానానికి చెప్పేశానని అన్నారు. అయితే అందులో వాస్తవమెంతన్నదిపుడే తెలియడం లేదు. ఒకవేళ నిజంగానే తాను షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చి వుంటే రాహుల్ గాంధీ పాదయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనిపించేవారని, అక్కడ కనిపించలేదు కాబట్టి ఆయన వివరణ ఇవ్వలేదని టీ.కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. కానీ ఓవైపు షోకాజ్ నోటీసును ఎదుర్కొంటున్న సమయంలో తాను అగ్రనేత పాదయాత్రకు ఎలా హాజరవుతానని వెంకటరెడ్డి ఎదురు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ పాదయాత్ర కేరళలో కొనసాగుతున్నప్పుడు వెంకటరెడ్డి వెళ్ళి.. ఆయనతోపాటు ఓరోజు నడిచి వచ్చారు. కానీ తెలంగాణలో రాహుల్ పాదయాత్ర కొనసాగుతున్నప్పుడు ఇక్కడే వున్న వెంకటరెడ్డి గౌరవసూచకంగా కూడా వెళ్ళలేదు. దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీతో తెగదెంపులకు సిద్దపడుతున్నారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

అధిష్టానం సీరియస్?

అయితే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా ఉందా? లేక ఆయన ఇచ్చిన వివరణతో వివాదానికి ఇక్కడితో ముగింపు పలకాలని భావిస్తుందా ? ఈ అంశాలపై ఇపుడు గాంధీభవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్రమశిక్షణాచర్యలకు గనక పార్టీ సిద్దమైతే.. తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి బాటలోనే వెంకటరెడ్డి వెళతారని పలువురు టీ.కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తాను టీపీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి పక్కలో బల్లెంలా తయారైన వెంకటరెడ్డిని పార్టీ నుంచి సాగనంపడమే బెటరని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు ఓ వర్గం చెబుతోంది. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భారత్ జోడో యాత్రకే ప్రాధాన్యమిచ్చారు. మునుగోడు ఎన్నికలంటూ తొలి రోజుల్లో కొంత హడావిడి చేసినా.. ఎప్పుడైతే రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేశించిందో.. అప్పట్నించి ప్రధాన నేతలంతా ఆయన పాదయాత్రను సక్సెస్ చేయడంలోనే బిజీగా గడిపారు. మునుగోడు ప్రచారం చివరికి మూడు, నాలుగు రోజుల్లో అయితే అభ్యర్థి పాల్వాయి స్రవంతి ప్రచారపర్వంలో ఒంటరి అయిపోయారు. ఇప్పుడు మునుగోడు ఉపఎన్నిక అయిపోయింది. రాహుల్ గాంధీ తెలంగాణను వీడి మహారాష్ట్రలోకి వెళ్ళిపోయారు. ఆ రెండు పూర్తవడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహార శైలి చర్చనీయాంశంగా మారింది. టీ.కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ హోదాలో వుండి.. మునుగోడులో వెంకట్ రెడ్డి ప్రచారం చేయని అంశంపై హైకమాండ్‌కు పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. ఈమేరకు పలువురు లేఖాస్త్రాలను సంధిస్తున్నారు. తన తమ్ముడికి సపోర్ట్ చేయాలంటూ ఫోన్లు చేసిన అంశాన్ని తమ ఫిర్యాదుల్లో ప్రస్తావిస్తున్నారు.

వేచి చూసే ధోరణిలో నేత!

ఏఐసీసీ నేత, ఎంపీ జైరాం రమేశ్.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇష్యుపై సీరియస్ అయ్యారు. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యమని, గీత దాటితే చర్యలు తప్పవని ఒకింత ఘాటుగానే చెప్పారు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని తెలిపారు. షోకాజ్ నోటీసుకు రెండు రోజుల క్రితమే సమాధానం ఇచ్చానని తెలిపారు. డిసిప్లినరీ కమిటీ చైర్మన్ తారిక్ ఆన్వర్ ఆందుబాటులో లేరని వివరించారు. ప్రస్తుతం తన నియోజకవర్గ పనుల కోసం తిరుగుతున్నానని చెప్పారు. షోకాజ్ నోటీసు ఇచ్చిన సమయంలో పాదయాత్రలో ఎలా పాల్గొంటానని ఎదురు ప్రశ్నించారు. క్లీన్ చీట్ వచ్చాకే జోడో యాత్రలో పాల్గొంటానని వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. మరొకవైపు అధిష్టానం తనపై ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూసే ధోరణిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నట్లు సమాచారం. బీజేపీలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలిచి ఉంటే కోమటిరెడ్డి ఆ పార్టీలోకి వెళ్లే వారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఓటమితో పార్టీ మారాలనే ఆలోచన చేయడం లేదని, అదేసమయంలో అధిష్టానం తీసుకునే నిర్ణయంపై తన భవిష్యత్తును ప్లాన్ చేసుకోవాలని వెంకటరెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. తన ఎంపీ పదవికి 2024 దాకా ఢోకా లేదని భావిస్తున్న వెంకటరెడ్డి.. 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దాకా వ్యూహాత్మక మౌనం పాటించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu