తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తున్న చిరుతలు, రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలను చిత్రీకరించిన పోలియో చుక్కల సిబ్బంది

|

Feb 01, 2021 | 3:42 AM

తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. ఒక దగ్గర బంధించేలోపే మరో చోట ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లా అడవుల్లో ఓ చిరుత జనాన్ని కంగారు పెట్టించింది...

తెలుగు రాష్ట్రాల్లో హడలెత్తిస్తున్న చిరుతలు,  రోడ్డుపై వెళ్తున్న దృశ్యాలను చిత్రీకరించిన పోలియో చుక్కల సిబ్బంది
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. ఒక దగ్గర బంధించేలోపే మరో చోట ప్రత్యక్షమవుతున్నాయి. తాజాగా నాగర్‌కర్నూలు జిల్లా అడవుల్లో ఓ చిరుత జనాన్ని కంగారు పెట్టించింది. నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాపూర్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పల్స్ పోలియో చుక్కలు వేయడానికి వెళ్లిన సిబ్బందికి చిరుతపులి కనిపించింది. దీంతో వాళ్లు భయాందోళనకు గురయ్యారు. వాట్వర్లపల్లి పిహెచ్ సి వైద్యసిబ్బంది విధులు నిర్వహించి తిరిగి కారులో వస్తున్న క్రమంలో చిరుత పులి కంట పడింది. అయితే చిరుత చెట్ల పొదల్లోకి వెళ్లే సరికి కారును ఆపారు. చిరుత రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలను సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు.

తెలంగాణలో ఇప్పటికే చాలా జిల్లాల్లో చిరుతపులులు, పెద్ద పులులు హడలెత్తిస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా, కొమరం భీమ్‌ జిల్లా, ఖమ్మం జిల్లా ఇలా పలు జిల్లాల్లో ఇప్పటికే చిరుత పులులు హడలెత్తిస్తున్నాయి. కొన్ని చోట్ల మనుషుల మీద దాడి చేసి ప్రాణాలు కూడా తీశాయి. దీంతో వీటిని పట్టుకుని బంధించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆపరేషన్‌ టైగర్‌ పేరుతో పులిని పట్టుకునేందుకు కొన్ని రోజులుగా అధికారులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇంకా వారి ప్రయత్నాలు ఫలించలేదు. అటవీ ప్రాంతంలో, పొలాల్లో సీసీకెమెరాలు ఏర్పాటు చేసి, పులి జాడ కనుక్కుంటూ, దాని అడుగుల జాడ తెలుసుకుంటూ ఆపరేషన్‌ కొనసాగించినా ఫలించడం లేదు.

మరోవైపు ఇప్పుడు నాగర్‌కర్నూలు జిల్లాలో పల్స్‌పోలియో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి చిరుత కనిపించడం కలకలం రేపుతోంది. ఒక చోట సంచరిస్తున్న పులిని పట్టుకుందామని ఆపరేషన్‌ కొనసాగిస్తుంటే, ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో పెద్దపులులు, చిరుతపులులు సంచరిస్తుండటంతో అటవీశాఖ అధికారులకు ఇది సవాల్‌గా మారింది. చిరుతపులి మళ్లీ ఎవరిమీద దాడి చేయకముందే దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పల్స్‌పోలియో సిబ్బంది తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన దృశ్యాలను బట్టి చిరుతపులి సంచరిస్తున్న ప్రాంతాలను గుర్తించే పనిలో పడ్డారు. మరోవైపు అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తుందనే సమాచారంతో అటు స్థానిక ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. చిరుతపులి తమ ప్రాంతంలోకి వచ్చి, ఎవరిపై దాడి చేస్తుందో తెలియక హడలిపోతున్నారు.